స్టార్ పేసర్ మహమ్మద్ షమీ జట్టులో లేకున్నా టీమిండియా బౌలింగ్ లైనప్ పటిష్టంగా ఉందని సౌతాఫ్రికా టెస్ట్ టీమ్ కెప్టెన్ టెంబా బవుమా అన్నాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25లో భాగంగా సొంతగడ్డపై జరగనున్న రెండు టెస్ట్‌ల సిరీస్‌లో పర్యాటక భారత్‌తో సౌతాఫ్రికా అమీతుమీ తేల్చుకోనుంది.
ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్ మంగళవారం సెంచూరియన్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో సోమవారం మీడియాతో మాట్లాడిన టెంబా బవుమా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

మహమ్మద్ షమీ లేకున్నా.. టీమిండియాతో తలపడటం సవాల్‌తో కూడుకున్న పనేనన్నాడు. సొంతగడ్డపై ఆడుతుండటం తమకు కలిసొచ్చే అంశమైనా.. పటిష్టమైన భారత్‌ను ఓడించాలంటే తీవ్రంగా కష్టపడాలని అభిప్రాయపడ్డాడు.
'క్రికెటర్లుగా మేం అత్యుత్తమమైన ప్రత్యర్థితో ఆడాలని కోరుకుంటాం. మహమ్మద్ షమీ వరల్డ్ బెస్ట్ పేసర్. మా జట్టులో చాలా మంది బ్యాటర్లకు అతని బౌలింగ్ ఆడాలని కోరుకున్నారు. కానీ అతను గాయం కారణంగా ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. మహమ్మద్ షమీ దూరమైనా.. టీమిండియా బలంగానే ఉంది.
అతని స్థానంలో ఎవరు బౌలింగ్ చేసినా మమ్మల్ని ఒత్తిడికి గురిచేస్తారు. సొంతగడ్డపై ఆడటం మాకు సానుకూలంశమే అయినా.. బలమైన బౌలింగ్ లైనప్ ఉన్న భారత్‌తో పోటీ సవాల్‌తో కూడుకున్నదే. మహమ్మద్ షమీ లేకున్నా భారత బౌలింగ్ దళం పటిష్టంగానే ఉంది. గత 5-10 ఏళ్లలో టెస్ట్‌ల్లో భారత్ అద్భుత విజయాలు సాధించింది. వారి బౌలింగ్ అటాక్ పటిష్టంగా మారడం వల్లే ఇది సాధ్యమైంది.'అని బవుమా చెప్పుకొచ్చాడు.
ఇప్పటి వరకు సౌతాఫ్రికా గడ్డపై టీమిండియా టెస్ట్ సిరీస్ విజయాన్ని అందుకోలేదు. దాంతో రోహిత్ శర్మ సారథ్యంలోని నెంబర్ వన్ టెస్ట్ టీమ్ అయిన టీమిండియా.. ఈ సారి ఆ కోరికను తీర్చుకోవాలనే పట్టుదలతో ఉంది. ఈ గెలుపుతో డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్‌తో పాటు ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో తమ అగ్రస్థానాన్ని నిలబెట్టుకోవాలని భావిస్తోంది.
అయితే ఇరు జట్ల మధ్య జరిగే తొలి టెస్ట్‌కు భారీ అడ్డంకి ఏర్పడింది. ఈ మ్యాచ్ జరిగే సెంచూరియన్‌లో భారీ వర్షం కురుస్తోంది. మంగళవారం కూడా వర్షం పడే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే సెంచూరియన్ మైదానాన్ని పూర్తిగా కవర్లతో కప్పి ఉంచారు. ఈ క్రమంలోనే తొలి రోజు ఆట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే అవకాశం ఉంది.