భారత్‌తో రెండో వన్డేలో విజయం సాధించడంపై సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా సంతోషం వ్యక్తం చేశాడు. ఇది రికార్డ్ ఛేజింగ్ అని తెలిపాడు. బౌలర్ల అసాధారణ ప్రదర్శనతో పాటు ఎయిడెన్ మార్క్‌రమ్, బ్రీట్జ్కే, డెవాల్డ్ బ్రెవిస్, బోష్ సూపర్ బ్యాటింగ్ తమ విజయానికి బాటలు వేసాయని అభిప్రాయపడ్డాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రాయ్‌పూర్ వేదికగా బుధవారం జరిగిన రెండో వన్డేలో సమష్టిగా రాణించిన సౌతాఫ్రికా 4 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించిన సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన బవుమా సమష్టి ప్రదర్శనతో ఈ భారీ విజయం సొంతమైందని తెలిపాడు. 'విజయాన్ని అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ మ్యాచ్‌లో బంతితో మెరుగైన ప్రదర్శన చేయాలని భావించాం. అందుకు తగ్గట్లుగానే మా బౌలర్లు కట్టడిగా బౌలింగ్ చేశారు. బ్యాటింగ్‌లో ఆరంభంలోనే మాకు మంచి భాగస్వామ్యం నెలకొల్పాల్సి వచ్చింది. ఎయిడెన్ మార్క్‌రమ్‌తో కలిసి నేను ఆ పని పూర్తి చేశాను. బ్రీట్జ్కే తన ఫామ్‌ను కొనసాగించగా.. కార్బిన్ బోష్ మెచ్యూర్ బ్యాటింగ్‌తో విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. ఇది నమ్మశక్యం కానీ ఆట. రికార్డ్ ఛేజింగ్ అని నేను అనుకుంటున్నా. భారత జట్టుతో ఆడటం ఎంత కష్టమో ఈ రోజు మరోసారి అర్థమైంది.

మార్క్‌రమ్ దూకుడుగా ఆడితే నేను అతనికి అండగా భాగస్వామ్యాన్ని నిర్మించే ప్రయత్నం చేశాను. ఏది ఏమైనా ఆటను చివరి వరకు తీసుకెళ్లాలని అనుకున్నాం. నేను కూడా ఆఖరి వరకు బ్యాటింగ్ చేయాలనుకున్నా. కానీ సాధ్యం కాలేదు. అయినప్పటికీ మంచి భాగస్వామ్యం నెలకొల్పాం. ఈ విజయం మా ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. ఇది మా అత్యుత్తమ టీమ్ అంటే అవుననే సమాధానం చెబుతాను. జట్టులో ఆటగాళ్ల మధ్య తీవ్ర స్థాయిలో పోటీ ఉంది. బ్యాటర్లు వారి స్థానాల కోసం పోటీ పడుతున్నారు.
క్వింటన్ డికాక్ రీఎంట్రీ ఇచ్చాడు. బౌలర్ల మధ్య కూడా అదే పరిస్థితి నెలకొంది. ఇలాంటి ప్రదర్శనలు మా ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తాయి. డీ జోర్జి, బర్గర్ గాయాలతో ఇబ్బంది పడుతున్నారు. నాండ్రే తన స్పెల్‌ను పూర్తి చేయలేకపోయాడు. టోనీ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. అయితే ఆఖరి వన్డేలో వారి స్థానాలను భర్తీ చేసే ఆటగాళ్లు మాకు ఉన్నారు.'అని టెంబా బవుమా చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 358 పరుగుల భారీ స్కోర్ చేసింది. విరాట్ కోహ్లీ(93 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 102), రుతురాజ్ గైక్వాడ్(83 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్‌లతో 105) సెంచరీలతో చెలరేగగా.. కెప్టెన్ కేఎల్ రాహుల్(43 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 66 నాటౌట్) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. అనంతరం సౌతాఫ్రికా 49.2 ఓవర్లలలో 6 వికెట్లకు 362 పరుగులు చేసి గెలుపొందింది. ఓపెనర్ ఎయిడెన్ మార్క్‌రమ్(98 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లతో 110) సెంచరీతో చెలరేగగా.. మాథ్యూ బ్రిట్జ్‌కే(64 బంతుల్లో 5 ఫోర్లతో 68), డెవాల్డ్ బ్రెవిస్(34 బంతుల్లో ఫోర్, 5 సిక్స్‌లతో 54) హాఫ్ సెంచరీలతో రాణించారు.