తమ ఆటగాళ్ల అద్వితీయమైన ప్రదర్శనతోనే భారత గడ్డపై టెస్ట్ సిరీస్‌ను గెలిచామని సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా తెలిపాడు. ముఖ్యంగా సైమన్ హర్మర్ ఈ విజయంలో కీలక పాత్ర పోషించాడని కొనియాడాడు. రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా బుధవారం గౌహతి వేదికగా ముగిసిన ఆఖరి టెస్ట్‌లో
సౌతాఫ్రికా 408 పరుగుల భారీ తేడాతో టీమిండియాను ఓడించింది.
ఈ విజయంతో సౌతాఫ్రికా 2-0తో సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసి చరిత్ర సృష్టించింది. 25 ఏళ్ల తర్వాత భారత గడ్డపై టెస్ట్ సిరీస్ గెలిచింది. ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన టెంబా బవుమా సమష్టి ప్రదర్శనతోనే ఈ గొప్ప విజయాన్ని అందుకున్నామని తెలిపాడు.

'ఇది చాలా పెద్ద విజయం. వ్యక్తిగతంగా ఈ గెలుపు నాకు చాలా సంతోషాన్నిచ్చింది. గాయం కారణంగా కొన్ని నెలల పాటు నేను ఆటకు దూరమయ్యాను. రీఎంట్రీ ఇచ్చిన తొలి సిరీస్‌లోనే విజయాన్నందుకు కోవడం గొప్ప అనుభూతినిచ్చింది. భారత గడ్డపై 2-0తో టెస్ట్ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయడం అంత సులువు కాదు. ఈ గెలుపు క్రెడిట్ మా ఆటగాళ్లదే.
ఈ సిరీస్‌లో మా ఆలోచనా విధానంలో చాలా మార్పు వచ్చింది. మా సన్నద్దత అనేది ఒక అంశమైతే.. మైదానంలో సత్తా చాటి జట్టుకు సహకారం అందించాలనే మా ఆటగాళ్ల తపన మరో అంశం. జట్టులోని ప్రతీ ఒక్కరు జట్టు కోసం కష్టపడుతున్నారు. మేం ఉన్నామనే భరోసాను కల్పిస్తున్నారు.
జట్టుగా మేం మంచి స్థితిలో ఉన్నాం. ఈ విజయం మా ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. జట్టులోని ప్రతీ ఒక్కరు విజయంలో కీలక పాత్ర పోషించాలనే తపనతో ఉన్నారు. ఈ సిరీస్‌లో ప్రతీ ఒక్కరు రాణించారు. భారీ శతకాలు సాధించలేకపోయినా.. విజయానికి కావాల్సిన పరుగులు చేశారు. ముఖ్యంగా నలుగురు, ఐదుగురు ఆటగాళ్లు అసాధారణ ప్రదర్శన కనబర్చారు. నా జట్టు గురించి ఎంత చెప్పినా తక్కువే.
సైమన్ హర్మర్ ఈ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతను 2015లోనూ భారత పర్యటనకు వచ్చాడు. ఇక్కడ ఆడిన అనుభవం అతనికి ఉంది. కేశవ్ మహరాజ్‌కు గొప్ప సహకారం అందించాడు. బంతిపై అతనికి మంచి నైపుణ్యం ఉంది. వారిని కాదని మరో బౌలర్‌కు బంతిని ఇవ్వలేకపోతున్నా. ఈ సిరీస్‌లో సైమర్ హర్మర్ మా మ్యాచ్ విన్నర్.'అని టెంబా బవుమా చెప్పుకొచ్చాడు. కెప్టెన్‌గా టెంబా బవుమా జైత్రయాత్ర కొనసాగుతోంది. సారథిగా 12 మ్యాచ్‌లకు బవుమా 11 గెలిపించాడు. మరో మ్యాచ్ డ్రాగా ముగిసింది.
సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 489 ఆలౌట్
భారత్ తొలి ఇన్నింగ్స్ 201 ఆలౌట్
సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్ 260/5 డిక్లేర్డ్
భారత్ రెండో ఇన్నింగ్స్ 140 ఆలౌట్