బ్యాటింగ్ వైఫల్యమే తమ ఓటమిని శాసించిందని సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా తెలిపాడు. మెరుగైన ఆరంభం లభించినా భారీ లక్ష్యాన్ని నమోదు చేయలేకపోయామన్నాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శనివారం వైజాగ్ వేదికగా జరిగిన మూడో వన్డేలో సమష్టిగా రాణించిన టీమిండియా 9 వికెట్ల తేడాతో సౌతాఫ్రికాను చిత్తు చేసింది. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది.
ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన బవుమా.. భారత్ అద్భుత ప్రదర్శన కనబర్చిందని కొనియాడాడు. ముఖ్యంగా భారత స్పిన్నర్లు తమ పతనాన్ని శాసించారని తెలిపాడు. 'ఈ రోజు కూడా మేం మ్యాచ్‌ను ఉత్సాహంగా మార్చాలనుకున్నాం. బ్యాటింగ్‌లో మేం సరైన లక్ష్యాన్ని నమోదు చేయలేకపోయాం. ఫ్లడ్ లైట్స్ కింద బ్యాటింగ్ చేయడం సులువు అవుతుంది. మేం అనవసర షాట్లతో వికెట్లు పారేసుకున్నాం. కాస్త తెలివిగా బ్యాటింగ్ చేయాల్సింది. భారత జట్టు తమ సత్తా ఏంటో చూపించింది. వారికి నా అభినందనలు.

మేం కాస్త తెలివిగా ఆడాల్సింది. తొలి రెండు వన్డేల్లో మేం అద్భుతమైన ప్రదర్శన చేశాం. కానీ ఈ రోజు రాణించలేకపోయాం. పరిస్థితులు కూడా భిన్నంగా ఉన్నాయి. వన్డేల్లో ఆలౌట్ అవ్వాలని ఎవరూ కోరుకోరు. మాకు మంచి ఆరంభాలు లభించాయి. క్వింటన్ డికాక్ సెంచరీతో రాణిస్తే.. నేను కూడా బాగా ఆడి ఔటయ్యాను. ఈ సిరీస్ కోల్పోయినా మా ప్రదర్శన చాలా మెరుగైంది. భారత్‌కు నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. వారిపై ఒత్తిడి తీసుకురావడం అంత సులువు కాదు. ఈ సిరీస్‌లో చాలా వరకు మేం మెరుగైన ప్రదర్శనే చేశాం. పది బాక్స్‌లు ఉంటే.. వాటిలో 6 -7 బాక్స్‌లు టిక్ చేశాం.'అని బవుమా చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 47.5 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌటైంది. క్వింటన్ డికాక్(89 బంతుల్లో 6 ఫోర్లతో 106) సెంచరీతో చెలరేగగా.. టెంబా బవుమా(67 బంతుల్లో 5 ఫోర్లతో 48) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్, ప్రసిధ్ కృష్ణ నాలుగేసి వికెట్లు తీయగా.. అర్ష్‌దీప్ సింగ్, రవీంద్ర జడేజా తలో వికెట్ తీసారు.
అనంతరం భారత్ 44 ఓవర్లలో వికెట్ నష్టానికి పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. యశస్వి జైస్వాల్(116 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో 107) సెంచరీతో చెలరేగగా.. విరాట్ కోహ్లీ(42 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 57), రోహిత్ శర్మ(73 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 75) హాఫ్ సెంచరీలతో రాణించారు. సౌతాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహరాజ్ ఒక్కడే వికెట్ తీయగా మిగతా బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు.