హైదరాబాద్: బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లనున్న భారత మహిళా జట్టును బీసీసీఐ ప్రకటించింది. 17 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను ఆదివారం వెల్లడించింది. ఈ నెల 9 నుంచి ప్రారంభమయ్యే ఈ పర్యటనలో భారత మహిళలు.. ఆతిథ్య బంగ్లాదేశ్‌తో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనున్నారు.
జట్టులో పెద్దగా మార్పులు చేయకపోయినా.. గాయంతో ఇబ్బంది పడుతున్న పేసర్ రేణుక సింగ్‌ను పక్కనపెట్టారు. యువ స్పిన్నర్ శ్రేయాంక్ పాటిల్‌పై వేటు వేసి ఆంధ్ర అమ్మాయి అనూష బారెడ్డికి టీ20, వన్డే టీమ్స్‌లో అవకాశం ఇచ్చారు. పూట గడవడం కోసం ఒకప్పుడు కూలీ పని చేసిన అనూష.. ఇప్పడు ఏకంగా టీమిండియాలో చోటు దక్కించుకోవడంపై ఆంధ్ర క్రికెట్ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

ఎన్నో కష్టాలకు ఓర్చి అనూష ఎదిగిన తీరు అందరికి స్పూర్తి దాయకం. అనంతపురం జిల్లా నార్పల మండలం బండ్లపల్లికి చెందిన అనూషది నిరుపేద రైతు కుటుంబం. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడ్డది. క్రీడల్లో రాణించి ఎదిగే పరిస్థితి కాదామెది. క్రికెట్ ఆడాలనే ఆసక్తి ఉన్నా.. ఎలా నేర్చుకోవాలో.. ఎక్కడ ఆడాలో కూడా తెలియదు.
స్కూల్ పీఈటీ రవీంద్ర ఆమెకు క్రికెట్‌లో ఓనమాలు నేర్పించాడు. మొదట పేస్ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ సత్తా చాటేది. అన్నిటికిమించి జాంటీ రోడ్స్‌లా ఫీల్డింగ్‌లో అదరగొట్టేది. ఏ మాత్రం భయపడకుండా డైవ్‌లు కొట్టి క్యాచ్‌లు అందుకునేది. ఒకవైపు చదువుకుంటూ.. క్రికెట్లో రాణిస్తునే ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు రోజువారీ కూలీ పని చేసేది.
2014లో అనంతపురంలోని ఆర్డీటీ(రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్) స్పోర్ట్స్ అకాడమీ నిర్వహించిన క్రికెట్ టోర్నీలో బండ్లపల్లి ప్రభుత్వ పాఠశాల తరఫున సత్తా చాటిన అనూష.. ఈ అకాడమీలో చేరే అవకాశాన్ని అందుకుంది. ఇదే ఆమె కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. ఇక్కడ చేరిన తర్వాత బౌలింగ్‌పైనే అనూష దృష్టి పెట్టింది. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లకు మంచి అవకాశాలు ఉండడంతో పేస్ నుంచి స్పిన్‌కు మారింది.
ఫ్లయిట్ డెలివర్లతో పాటు క్యారమ్ బాల్స్‌తో బంతిని గిర్రున తిప్పుతూ బ్యాటర్లను బుట్టలో వేసే అనూష.. ఏజ్ కేటగిరీ టోర్నీల్లో నిలకడగా రాణించి ఆంధ్ర అండర్-19 జట్టులో చోటు దక్కించుకుంది. 2018 చెన్నై వేదికగా జరిగిన సౌత్‌జోన్ టోర్నీలోనూ ఆకట్టుకుంది. ఈ ప్రదర్శనతో 2019లో ఎన్‌సీఏలో చేరిన ఆమె ఆట మరింత మెరుగైంది.
2021లో బీసీసీఐ సీనియర్ వన్డే టోర్నీలోనూ అనూష తనదైన ముద్ర వేసింది. ఈ ఏడాది జనవరిలో హైదరాబాద్‌లో జరిగిన ఇంటర్ జోనల్ టోర్నమెంట్లో సౌత్‌జోన్‌కు ఆడుతూ ఈస్ట్‌జోన్‌పై అనూష (4/10) అద్భుత ప్రదర్శన చేసింది. బరోడాలో జరిగిన మ్యాచ్‌లో త్రిపురపై 10 పరుగులకే 5 వికెట్లు పడగొట్టి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించింది.
హాంకాంగ్‌లో జరిగిన మహిళల వర్ధమాన క్రికెటర్ల కప్‌లో భారత్-ఏకు ఆడే అవకాశాన్ని దక్కించుకున్న అనూష.. అదే జోరుతో సీనియర్ జట్టులోనూ స్థానాన్ని సంపాదించింది. ఫీల్డింగ్ అంటే ఎంతో ఇష్టపడే అనూష.. స్టన్నింగ్ క్యాచ్‌లతో పాటు మెరుపు రనౌట్‌లు చేసింది. రవీంద్ర జడేజాను అభిమానించే అనూష.. అతనిలాగే ఆల్‌రౌండర్‌గా సత్తా చాటాలని కోరుకుంటోంది.