హైదరాబాద్: టీమిండియా వెటరన్ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాటర్ అంబటి రాయుడు అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. రెండు రోజుల క్రితమే ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పిన ఈ తెలుగు తేజం.. ఆరోసారి ఐపీఎల్ టైటిల్ గెలిచిన అనంతరం క్రికెట్‌కు పూర్తిగా వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు.
ఈ మేరకు ట్విటర్ వేదికగా ఓ సుదీర్ఘ పోస్ట్‌ను షేర్ చేశాడు. తన క్రికెట్ ప్రయాణంలో అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపాడు. తన పొలిటికల్ ఇన్నింగ్స్ గురించి కూడా రాయుడు హింట్ ఇచ్చాడు.

'ఈ రాత్రి నాకు ఎంతో భావోద్వేగపూరితమైనది. ఈ ఐపీఎల్ విజయం నాకు ఎంతో ప్రత్యేకమైనది. ఈ ఆనందంలోనే అన్ని ఫార్మాట్ల ఆటకు గుడ్‌బై చెబుతున్నాను. చిన్నప్పుడు టెన్నిస్ బాల్‌తో మొదలైన నా క్రికెట్ ప్రయాణం.. ఇంత వరకు కొనసాగుతుందని, మూడు దశాబ్దాల పాటు ఆటలో కొనసాగుతానని అస్సలు ఊహించలేదు.
అండర్-15 నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు భారత్ తరఫున ఆడటాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నా. 2013లో తొలిసారి టీమిండియా క్యాప్ అందుకున్న క్షణం ఇప్పటికీ నాకు గుర్తుంది. నా జీవితాంతం గుర్తుండిపోయే మధుర క్షణం అది. నా ప్రతిభను నమ్మి ఆడే అవకాశం ఇచ్చిన బీసీసీఐ, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, విదర్భ క్రికెట్ అసోసియే, బరోడా క్రికెట్ అసోసియేషన్‌లకు ప్రత్యేక ధన్యవాదాలు.
అలాగే ఐపీఎల్‌లో నేను ప్రాతినిథ్యం వహించిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లకు కృతజ్ఞతలు. ఆరో ఐపీఎల్ టైటిల్‌తో నా కెరీర్‌ను ముగించడం పట్ల గర్వంగా ఫీలవుతున్నా. ముంబై ఇండియన్స్ తరఫున 2013లో తొలిసారి ఐపీఎల్ టైటిల్ గెలిచిన నేను.. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున 2018, 2021, 2023లో చాంపియన్‌గా నిలవడాన్ని ఎప్పటికీ మరిచిపోను.
కెప్టెన్ ధోనీతో కలిసి సీఎస్‌కే, టీమిండియా తరఫున ఆడటాన్ని అదృష్టంగా భావిస్తున్నా. మూడు దశాబ్దాల ప్రయాణంలో మైదానంలో, బయట మా మధ్య ఎన్నో మధుర జ్ఞాపకాలున్నాయి. నా సక్సెస్‌కు కుటుంబం మద్దుతు ఎంతో ఉంది. ముఖ్యంగా నా తండ్రి సాంబశివ రావు నన్ను ఎంతో ప్రోత్సహించారు.
కెరీర్ ఆరంభంలో అండగానిలిచిన కోచ్‌లు, టీమ్‌మేట్స్, సపోర్ట్ స్టాఫ్, అభిమానులకు కృతజ్ఞతలు. కెరీర్‌లో ఒడిదొడుకులు ఎదుర్కొన్న ప్రతీసారి అభిమానులు అండగా నిలిచారు. వారి మద్దతు వెల కట్టలేనిది. ఇక నుంచి నన్ను మరో కోణంలో చూస్తారు.'అని అంబటి రాయుడి పేర్కొన్నాడు.
అంబటి రాయుడు రాజకీయాల్లో తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడని, వైఎస్సార్‌సీపీ తరఫున పొటీ చేసే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఐపీఎల్ 2023 సీజన్ ప్రారంభానికి ముందే రాయుడు తన పేరును ఏటీఆర్‌గా మార్చుకొని వైఎస్ జగన్‌కు సోషల్ మీడియా వేదికగా మద్దతు తెలపడం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది.
గుజరాత్ టైటాన్స్‌తో సోమవారం జరిగిన ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో గెలిచి ఐదో సారి టైటిల్ అందుకున్న విషయం తెలిసిందే.