భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) మరోసారి తెలుగు రాష్ట్రాలకు మొండి చేయి చూపింది. అప్‌కమింగ్ ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో ఒక్క మ్యాచ్‌ను కూడా తెలుగు రాష్ట్రాలకు కేటాయించలేదు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)కు చెందిన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంతో పాటు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) ఆధ్వర్యంలోని వైజాగ్ స్టేడియాలను బీసీసీఐ పట్టించుకోలేదు.
అప్‌కమింగ్ టీ20 ప్రపంచకప్ 2026 షెడ్యూల్‌ను ఐసీసీ మంగళవారం ప్రకటించింది. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరిగే ఈ టోర్నీకి భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న సంగతి తెలిసిందే. ముందస్తు ఒప్పందం ప్రకారం పాకిస్థాన్ మ్యాచ్‌లన్నీ శ్రీలంక వేదికగా జరగనున్నాయి. ఒకవేళ ఆ జట్టు నాకౌట్ చేరితే ఆ మ్యాచ్‌లు కూడా అక్కడే జరుగుతాయి.

భారత్‌లో జరిగే ప్రపంచకప్ మ్యాచ్‌లకు అహ్మదాబాద్, ఢిల్లీ, కోల్‌కతా చెన్నై, ముంబై నగరాలు ఆతిథ్యమివ్వనున్నాయి. పాకిస్థాన్, నాకౌట్‌తో పాటు ఫైనల్ చేరకపోతే ముంబై, కోల్‌కతాలో సెమీఫైనల్స్, అహ్మదాబాద్ వేదికగా ఫైనల్ జరుగనుంది. వైజాగ్, హైదరాబాద్ నగరాలకు ఒక్క టీ20 ప్రపంచకప్ మ్యాచ్ కేటాయించకపోవడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సౌతిండియా నుంచి చెన్నై ఒక్క నగరాన్నే ఎంపిక చేయడం ఏంటని మండిపడుతున్నారు.
తెలుగు రాష్ట్రాలకు అంతర్జాతీయ మ్యాచ్‌లు కేటాయించకపోవడాన్ని తప్పుబడుతున్నారు. మైదానాల కేటాయింపులో రొటేషన్ పాలసీని పాటిస్తామని చెప్పే బీసీసీఐ.. అహ్మదాబాద్, చెన్నై, ముంబై నగరాలకు మాత్రం ఇలాంటి రూల్స్‌ను వర్తింపచేయదని మండిపడుతున్నారు. బీసీసీఐలో గుజరాత్, ముంబైదే పూర్తి పెత్తనంగా మారిందని మండిపడుతున్నారు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)లో నెలకొన్న గొడవలు కూడా మ్యాచ్‌లు కేటాయించకపోవడానికి కారణంగా మారిందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చొరవ తీసుకొని వైజాగ్‌కు మ్యాచ్‌లు కేటాయించాల్సిందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. నారా లోకేష్ చొరవతోనే వైజాగ్‌కు మహిళల వన్డే ప్రపంచకప్ 2025 మ్యాచ్‌లు కేటాయించారు. ఈ కారణంగానే పురుషుల టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లను వైజాగ్‌కు కేటాయించలేదని తెలుస్తోంది.
అంతేకాకుండా పాకిస్థాన్ మ్యాచ్‌లు శ్రీలంక వేదికగా జరగనుండటం కూడా హైదరాబాద్ వేదికను ఎంపిక చేయకపోవడానికి ప్రధాన కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వన్డే ప్రపంచకప్ 2023లో పాకిస్థాన్ మ్యాచ్‌లు హైదరాబాద్ వేదికగానే జరిగాయి.