నాతో ఆడిన పంత్, అయ్యర్ భారత్ జట్టుకు ఆడుతుంటే నేనేమో క్యాటరింగ్ చేస్తున్నా: తెలుగు క్రికెటర్ ఆవేదన

హైదరాబాద్: ఒకప్పుడు తనతో ఆడిన రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్ భారత్ జట్టుకు ఆడుతుంటే తానేమో క్యాటరింగ్ పనిచేస్తున్నానని ఓ తెలుగు క్రికెటర్ ఆవేదన వ్యక్తం చేశాడు. దురదృష్టానికి తోడు సరైన ప్రోత్సాహం లేక, కుటుంబ పరిస్థితుల కారణంగా తాను ఇలా క్యాటరింగ్ దినసరి కూలీగా మారాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నాడు.
తనకు ప్రోత్సాహం అందించాలని కలవని రాజకీయనాయకుడు లేడని, చివరకు గవర్నర్లను కలిసి కూడా తన ధీనస్థితిని మొరపెట్టుకున్నా తనకు ఎవరూ సాయం చేయలేదన్నాడు.
అయినా భారత జట్టుకు ఆడాలనే తన లక్ష్యం అలానే ఉందని, ఎన్ని కష్టాలు ఎదురైనా ఆటను వదిలే ప్రసక్తే లేదని తాజాగా ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో స్పష్టం చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తుంది.
ఇంతకీ అతనెవరంటే..?
ఇన్ని కష్టాలు పడుతున్న ఆ తెలుగు యువ క్రికెటర్ ఎవరో కాదు గుంటూరు జిల్లా తుళ్లూరు మండంలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన కిరణ్ కుమార్. జూనియర్ స్థాయి క్రికెట్‌లో కిరణ్ కుమార్ ఆంధ్ర జట్టుతో పాటు భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. అండర్-19, అండర్ -21 జట్లతో విదేశీ పర్యటనలకు వెళ్లాడు. రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్‌లతో జూనియర్ స్థాయిలో డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకున్నాడు. అప్పటి ఢిల్లీ డేర్ డేవిల్స్ (ప్రస్తుత ఢిల్లీక్యాపిటల్స్) టీమ్ ప్రాబబుల్స్‌కు ఎంపికయ్యాడు. అక్కడ మంచి పెర్ఫామెన్స్ కనబర్చి జట్టులోకి తీసుకునే సమయంలో అతన్ని దురదృష్టం వెంటాడింది. భుజగాయంతో వెనుదిరిగిన కిరణ్ కుమార్‌కు అక్కడి నుంచి కష్టాలు మొదలయ్యాయి.
పంత్ నేను ఒకే గదిలో..
దివ్యాంగురాలైన తన తల్లి, టైలర్ అయిన తన తండ్రిని మరింత కష్టపెట్టడం ఇష్టలేక క్యాటరింగ్ భాయ్‌గా పనిచేస్తున్నానని తెలిపాడు. చెల్లి చదువు, తన ప్రాక్టీస్‌కు కావాల్సిన ఆదాయాన్ని సంపాదించుకుంటూ తన లక్ష్యం కోసం ముందుకు సాగుతున్నానని తెలిపాడు. రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్‌తో రూమ్ కూడా షేర్ చేసుకున్నానని, ఈ విషయం ఎవరూ చెప్పినా నమ్మడం లేదన్నాడు. అండర్-19, 21లో భారత జట్టులో ఆడానని, తన పెర్ఫామెన్స్‌కు ముగ్దుడైన టీమిండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్, తనను ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాబబుల్స్ కు పిలిచాడని కిరణ్ కుమార్ చెప్పుకొచ్చాడు. కానీ గాయంతో అవకాశం రాకుండానే వెనుదిరిగాల్సి వచ్చిందన్నాడు. ఎప్పటికైనా టీమిండియాకు ఆడాలనే లక్ష్యంతోనే ముందుకు సాగుతున్నానని, రోజుకు నాలుగు, ఐదు గంటలు ప్రాక్టీస్ చేస్తున్నానని చెప్పుకొచ్చాడు. తల్లిదండ్రుల అనారోగ్యం కారణంగా ఓసారి సెలెక్షన్స్‌కు కూడా వెళ్లలేకపోయానన్నాడు.
చాలా బాధగా ఉంది..
తన తల్లిదండ్రుల వైద్యం కోసం లక్ష రూపాయలు అప్పు చేశానన్నాడు. ఇక తనతో ఆడిన ఆటగాళ్లంతా దేశానికి ప్రాతినిథ్యం వహిస్తుంటే.. తానేమో కనీసం ఎవరికి తెలియని స్థితిలో ఉండటం చాలా బాధగా ఉందన్నాడు. క్యాటరింగ్ చేస్తూ ఎన్ని అవమానాలు ఎదురైనా తన లక్ష్యం, కుటుంబం కోసం అన్ని పంటిబిగువన భరిస్తున్నానన్నాడు. ఎవరైనా తనకు ప్రోత్సాహం అందిస్తే తప్పుకుండా టీమిండియాకు ఆడతానని ధీమా వ్యక్తం చేశాడు. అంతేకాకుండా రాహుల్ ద్రవిడ్ ఏదో ఒక రోజు ఫోన్ చేస్తాడని ఎదురు చూస్తున్నానని ఈ 25 ఏళ్ల కిరణ్ కుమార్ చెప్పుకొచ్చాడు.
ట్విటర్‌లో ట్రెండింగ్..
ఇక కిరణ్ కుమార్ కష్టాలకు చలించిపోయిన నెటిజన్లు అతనికి సాయం చేయాలని ట్విటర్ వేదికగా విజ్ఞప్తి చేస్తున్నారు. టీమిండియా దిగ్గజాలు రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ, వీవీ లక్ష్మణ్‌లకు ట్యాగ్ చేస్తూ అతని ధీనగాధను వివరిస్తున్నారు. బీసీసీఐతో పాటు ప్రముఖ కామెంటేటర్, తెలుగు రాష్టాలకు చెందిన హర్షా భోగ్లేకు సైతం కిరణ్ కుమార్ ఏమోషనల్ వీడియోను ట్యాగ్ చేస్తున్నారు. ప్రస్తుతం కిరణ్ కుమార్ వ్యవహారం నెట్టింట మారుమోగుతోంది. ఏ హీరో ఫ్యాన్స్ ఆ హీరోలకు, రాజకీయ నాయకులకు కిరణ్ కుమార్ ధీన స్థితిని తెలిసేలా ట్వీట్లు చేస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications