హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వైఫల్యం కొనసాగుతోంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో గురువారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పేలవ బ్యాటింగ్‌తో సన్‌రైజర్స్ 5 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. చివరి 6 బంతుల్లో 9 పరుగులు చేయలేక ఓటమికి తల వంచింది. ఈ ఓటమి నేపథ్యంలో తెలుగు బుల్లితెర నటి వర్షణిని సన్‌రైజర్స్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు.
ఉప్పల్ వేదికగానే ఈ మ్యాచ్ జరగడంతో చాలామంది తెలుగు అభిమానులతో పాటు.. సెలబ్రిటీలు కూడా సందడి చేశారు. వారిలో యాంకర్ వర్షిణి కూడా ఉంది. సన్‌రైజర్స్‌కు అండగా స్టేడియంలో కేరింతలు కొడుతూ మ్యాచ్‌ను తెగ ఎంజాయ్ చేసింది. ఈ మ్యాచ్‌కు హాజరైన ఫొటోలను వర్షిణి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేయగా.. అభిమానులు ఆమెను ట్రోలింగ్ చేస్తున్నారు.

వర్షిణి కారణంగానే సునాయసంగా గెలిచే మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓడిందని ఆరోపిస్తున్నారు. ఆమె హాజరైన ప్రతీ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఓడిందని గుర్తు చేస్తున్నారు. దయచేసి మరోసారి మ్యాచ్‌కు రావద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. కొందరు అయితే 'వర్షిణి.. నీ ఐరెన్ లెగ్‌తో గెలిచే మ్యాచ్‌లో ఓడించావ్ కదా!'అని ఘాటుగా విమర్శిస్తున్నారు. 'నీకు దండం పెడుతాం తల్లి దయచేసి మ్యాచ్‌కు వెళ్లకు'అని మరికొందరు కోరుతున్నారు.
ముంబై ఇండియన్స్‌తో ఉప్పల్ వేదికగా జరిగిన గత మ్యాచ్‌లోనూ సన్‌రైజర్స్ ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌కు కూడా వర్షిణి హాజరైంది. మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్‌తో సెల్ఫీ దిగింది. ఈ ఫొటోను షేర్ చేయగా.. డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో అభిమానులు ఆడుకున్నారు.
'సూర్య కుమార్ పక్కన నువ్వేంటి? అసలు నిన్ను ఎవరు రానిచ్చారు లోపలికి'? అని కొంతమంది సెటైర్లు పేల్చితే.. సూర్యకుమార్ యాదవ్‌ను బావా అని.. వర్షిణిని అక్కా అని వరసలు కలిపేస్తూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అక్కా బావో అని అని కామెంట్లు చేసారు. సూర్య కుమార్ యాదవ్‌కు పెళ్లి అయిపోయింది. వదిలెయ్ వర్షిణి అక్కో అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇంకొంతమంది అయితే.. 360° బ్యాట్స్‌మెన్‌ను లైన్‌లో పెట్టేసింది అంటూ విమర్శించారు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 171 పరుగులు చేసింది. కెప్టెన్ నితీశ్ రాణా(31 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 42), రింకూ సింగ్(35 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 46) రాణించారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో నటరాజన్, మార్కో జాన్సెన్ రెండేసి వికెట్లు తీయగా.. భువనేశ్వర్ కుమార్, కార్తీక్ త్యాగీ, ఎయిడెన్ మార్క్‌రమ్, మయాంక్ మార్కండే తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 166 పరుగులే చేసి ఓటమిపాలైంది. కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్(40 బంతుల్లో 4 ఫోర్లతో 41), హెన్రీచ్ క్లాసెన్(20 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 36) రాణించినా ఫలితం లేకపోయింది. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ అరోరా, శార్దూల్ ఠాకూర్ రెండేసి వికెట్లు తీయగా.. హర్షిత్ రాణా, ఆండ్రీ రస్సెల్, అనుకుల్ రాయ్, వరుణ్ చక్రవర్తీ తలో వికెట్ పడగొట్టారు. ఆఖరి ఓవర్ వేసిన వరుణ్ చక్రవర్తీ మూడు పరుగులు మాత్రమే ఇచ్చి కేకేఆర్‌ను గెలిపించాడు.