మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత్ విశ్వవిజేతగా నిలిచింది. అర్థశతాబ్దపు కలను సాకారం చేసుకుంది. గతంలో రెండు సార్లు చేజారిన కప్‌ను ఈసారి హర్మన్‌సేన ఎలాంటి తప్పిదం చేయకుండా చేజిక్కించుకుంది. 1983 ప్రపంచకప్ విజయం భారత క్రికెట్ గతిని మార్చినట్లే.. తాజా విజయం అమ్మాయిల ఆటను మరోస్థాయికి చేర్చనుంది.
మైదానంలో 11 మంది ప్లేయర్లే బరిలోకి దిగినా.. ఈ విజయంలో తెరవెనుక ఎంతో మంది అలుపెరగని కృషి ఉంది. మాజీ క్రికెటర్ల ప్రోత్సాహం, సపోర్ట్ స్టాప్ అండ, బీసీసీఐ మద్దతు వెరసి టీమిండియాకు చిర్మసరణీయమైన విజయాన్ని అందించాయి. ఆటగాడిగా దక్కని విజయాన్ని అమోల్ ముజుందార్ హెడ్ కోచ్‌గా అందుకున్నాడు. ముజుందార్‌కు ప్లేయర్లతో పాటు అతని సపోర్ట్ స్టాఫ్ అండగా నిలిచింది.

టీమిండియా విజయంలో టాలీవుడ్ ప్రముఖ నటుడు, న్యాయవాది సీవీఎల్ నర్సింహ్మరావు అల్లుడు కూడా ఉన్నాడు. ఈ విషయాన్ని ఆయనే సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. మహిళల ప్రపంచకప్ విజయానంతరం తన ఆనందాన్ని పంచుకున్నాడు. నర్సింహ్మారావు అల్లుడు ఎవరో కాదు.. భారత మహిళల జట్టు స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్ అశోక్ అయ్యంగర్ హర్ష.
భారత మహిళలను మానసికంగా మరింత బలంగా సిద్దం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా ఈ టోర్నీలో వరుసగా మూడు పరాజయాలను ఎదుర్కొన్న హర్మన్‌సేనలో హెడ్ కోచ్ ముజుందార్‌తో కలిసి కసిని రగిల్చాడు.
ముఖ్యంగా ఫైనల్ ముందు అమ్మాయిలతో హర్ష ప్రత్యేకంగా మాట్లాడాడు. ఫైనల్లో ఉండే ఒత్తిడిని అధిగమించేందుకు కావాల్సిన చిట్కాలను వివరించాడు. ప్రపంచకప్ విజేతగా నిలిచేందుకు ఇదో సువర్ణవకాశమని, చేజారకుండా చూసుకోవాలని తమ ఆటగాళ్లకు నూరిపోసాడు. చిన్న తప్పిదం కూడా చేయవద్దని, మ్యాచ్ ముగిసే వరకు మరో ఆలోచనను మనసులోకి రానివ్వకూడదని తెలిపాడు.
ఒత్తిడిలో కూడా తమ శక్తి సామర్థ్యాలను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలని సూచించాడు. హర్ష మాట్లాడుతున్న వీడియోనే సీవీఎల్ నర్సింహ్మా రావు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. చెన్నైకి చెందిన అశోక్ అయ్యంగార్‌ను సీవీఎల్ నర్సింహ్మారావు కూతురు కావ్య ప్రేమ వివాహం చేసుకున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలుస్తోంది. హర్ష హైదరాబాద్ తరఫున రంజీ క్రికెట్ ఆడినట్లు కూడా తెలుస్తోంది. కానీ ఈ విషయంపై స్పష్టమైన సమాచారం లేదు.
ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన సీవీఎల్ నర్సింహ్మరావు సుమారు 60 తెలుగు సినిమాల్లో నటించారు. క్రిమినల్ లాయర్ అయిన సీవీఎల్ నర్సింహ్మారావు సహాయక పాత్రల్లో నటించారు. ఠాగూర్, వెంకీ, గోదావరి, రెడీ, ఊహలు గుసగుసలాడే,అ!, మజిలీ, జాతి రత్నాలు, వకీల్ సాబ్, దృశ్యం 2, టిల్లు స్క్వేర్ వంటి పలు సినిమాల్లో నటించారు. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో 'రతనాల వీణ' (2011) అనే చిత్రాన్ని నిర్మించి, దర్శకత్వం వహించారు.