ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 విజేత, హైదరాబాద్ స్టార్ క్రికెటర్ తిలక్ వర్మ.. సీఎం రేవంత్ రెడ్డిని కలిశాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 విజయానంతరం హైదరాబాద్‌కు చేరుకున్న తిలక్ వర్మ.. సోమవారం మర్యాదపూర్వకంగా సీఎంను కలిశాడు. ఈ సందర్భంగా తిలక్ వర్మను సీఎం రేవంత్ రెడ్డి సత్కరించారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు వాకిటి శ్రీహరి, మహమ్మద్ అజారుద్దీన్‌తో పాటు ఏంపీ వేం నరేందర్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేనా రెడ్డి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, ఎండీ డాక్టర్ సోనీ బాలా దేవి పాల్గొన్నారు. అయితే తిలక్ వర్మకు తెలంగాణ ప్రభుత్వం తరఫున ఎలాంటి బహుమానాన్ని ప్రకటించలేదు. గతంలో మహమ్మద్ సిరాజ్‌కు ఇచ్చిన తరహాలోనే తిలక్ వర్మకు ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ఇంటి స్థలం ప్రకటిస్తారని ప్రచారం జరిగింది. కానీ తెలంగాణ సర్కార్ ఇప్పటి వరకు తిలక్ వర్మకు ఎలాంటి బహుమానాన్ని ప్రకటించలేదు.

అయితే అతి త్వరలోనే తిలక్ వర్మకు ప్రభుత్వం అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వనుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అంతకుముందు ముంబై నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న తిలక్ వర్మకు ఘన స్వాగతం లభించింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) అధికారులతో పాటు శాట్స్ ఛైర్మన్ శివసేనా రెడ్డి, అభిమానులు తిలక్ వర్మకు ఘన స్వాగతం పలికారు. దాంతో శంషాబాద్ ఎయిర్ పోర్టు తిలక్ నామస్మరణతో దద్దరిల్లింది.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024 గెలిచిన భారత జట్టులో భాగంగా ఉన్న సిరాజ్‌కు తెలంగాణ సర్కార్ డీఎస్పీ ఉద్యోగంతో పాటు జూబ్లీహిల్స్‌లో 600 గజాల నివాస స్థలాన్ని బహుమతిగా అందజేసింది. తిలక్ వర్మకు కూడా గ్రూప్-1 ఉద్యోగంతో పాటు ఇంటి స్థలం బహుమతిగా అందజేయవచ్చని స్పోర్ట్స్ సర్కిల్స్‌లో చర్చజరిగింది. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన వెంటనే ఈ ప్రకటన చేస్తారని అంతా అనుకున్నారు. కానీ తెలంగాణ సర్కార్ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన అయితే చేయలేదు.
టీ20 ప్రపంచకప్ 2026లో తిలక్ వర్మ 9 మ్యాచ్‌ల్లో 154.47 స్ట్రైక్‌రేటుతో 207 పరుగులు చేశాడు. చివర్లో బ్యాటింగ్‌కు వచ్చి విలువైన పరుగులు అందించాడు. ఆసియా కప్ 2025 విజయానంతరం కూడా తిలక్ వర్మ సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసాడు. అయితే తెలంగాణ సర్కారే కాదు.. ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత క్రికెటర్లకు ఎలాంటి నజరానాలను ప్రకటించలేదు. బీసీసీఐ మాత్రం రూ.131 కోట్ల క్యాష్ ప్రైజ్ ప్రకటించింది. ప్రతీ ఆటగాడికి రూ.6 కోట్ల నగదు దక్కనుంది.