ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్, అర్జెంటీనా దిగ్గజం లియోనల్ మెస్సీ హైదరాబాద్ నగరానికి రానున్నాడు. భారత పర్యటనలో భాగంగా ఈ అర్జెంటీనా స్టార్ హైదరాబాద్‌లో పర్యటించనున్నాడు. ఈ విషయాన్ని లియోనల్ మెస్సీ ఇన్‌స్టా వేదికగా వెల్లడించాడు. మరికొద్ది రోజుల్లో తన పర్యటన మొదలవ్వనుందని, భారత్ చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలని మెస్సీ తన పోస్ట్‌లో పేర్కొన్నాడు. తన పర్యటనలో హైదరాబాద్ కూడా ఉండటం సంతోషకరమైన విషయమని తెలిపాడు.
డిసెంబర్ 13న లియోనల్ మెస్సీ హైదరాబాద్‌కు రానున్నారు. మెస్సీ రాకపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మెస్సీకి ఘన స్వాగతం పలుకుతూ రేవంత్ రెడ్డి శుక్రవారం ట్వీట్ చేశారు.
'డిసెంబర్ 13న దిగ్గజ ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనల్ మెస్సికి హైదరాబాద్‌లో ఘన స్వాగతం పలికి, ఆతిథ్యం ఇవ్వడానికి నేను ఎదురు చూస్తున్నాను. ఫుట్‌బాల్ చరిత్రలోనే గొప్ప ఆటగాడైన మెస్సీ మన నగరానికి వస్తుండటం ప్రతీ ఫుట్‌బాల్ అభిమానికీ మరుపురాని క్షణం. ఈ దిగ్గజ ఆటగాడికి ఆతిథ్యం ఇచ్చేందుకు హైదరాబాద్ నగరంతో పాటు ప్రజలు సిద్దంగా ఉన్నారు.'అని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.

లియోనల్ మెస్సి భారత పర్యటనలో భాగంగా కోల్‌కతా, ముంబై, ఢిల్లీతో పాటు హైదరాబాద్‌కు రానున్నారు. డిసెంబర్ 13 సాయంత్రం మెస్సీ హైదరాబాద్‌కు చేరుకుంటారు. అదే రోజు రాత్రి ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే 7vs7 ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో పాల్గొంటారు. ఈ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లను జొమాటో డిస్ట్రిక్ట్ యాప్‌లో నేటి(నవంబర్ 28) నుంచి అందుబాటులోకి వచ్చాయి.
డిసెంబర్ 13-15 వరకు మెస్సీ భారత్‌లోనే ఉండనున్నాడు. డిసెంబర్ 13 ఉదయం కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌కు వెళ్లనున్న మెస్సీ.. అదే రోజు సాయంత్రం హైదరాబాద్‌కు వస్తారు. డిసెంబర్ 14 సాయంత్రం ముంబైలోని వాంఖడే స్టేడియానికి వెళ్తారు. డిసెంబర్ 15 మధ్యాహ్నం ఒంటి గంటకు ఢిల్లీలోకి అరుణ్‌జైట్లీ స్టేడియాన్ని సందర్శిస్తారు.