టీ20 ప్రపంచకప్ 2024 మెగా టోర్నీకి రంగం సిద్దమైంది. మరో మూడు రోజుల్లో అగ్రరాజ్యం అమెరికా వేదికగా ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. ఇప్పటికే ఈ టోర్నీలో పాల్గొనే జట్లు అమెరికా చేరి సన్నాహకాలు ప్రారంభించాయి. టీమిండియా సైతం తమ ప్రాక్టీస్ సెషన్‌ను మొదలుపెట్టింది. అయితే ఈసారి టీమిండియాకు బౌలింగ్ బెంగపట్టుకుంది.
ఆస్ట్రేలియా వేదికగా జరిగిన గత టీ20 ప్రపంచకప్‌లో బౌలింగ్ వైఫల్యమే టీమిండియా కొంపముంచింది. బలమైన బ్యాటింగ్‌తో సెమీస్ చేరిన టీమిండియా.. ఇంగ్లండ్ చేతిలో పేలవ బౌలింగ్‌తో ఖంగుతిన్నది. ఈ మ్యాచ్‌లో భారత్ 169 పరుగుల లక్ష్యాన్ని నమోదు చేయగా.. ఇంగ్లండ్ 16 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా చేధించింది.

జస్‌ప్రీత్ బుమ్రా ఉన్నా..
భారత బౌలర్లలో ఒక్కరు కూడా ఇంగ్లండ్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టలేకపోయారు. గాయం కారణంగా గత టీ20 ప్రపంచప్‌కు జస్‌ప్రీత్ బుమ్రా దూరంగా ఉన్నాడు. దాంతో టీమిండియా బౌలింగ్ బలహీనంగా మారింది. అయితే ఈ సారి అతను అందుబాటులోకి వచ్చాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో 13 మ్యాచ్‌ల్లో 16.80 సగటుతో 20 వికెట్లు తీసాడు.
బ్యాటర్లు ఆధిపత్యం చెలాయించిన ఈ సీజన్‌లో 6.48 ఎకానమీతో బుమ్రా సత్తా చాటాడు. అతని సూపర్ ఫామ్ టీమిండియాకు కలిసొచ్చే విషయమే అయినా.. అతనికి అండగా మరో ఎండ్‌లో చెలరేగే బౌలర్ ఎవరా? అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
సిరాజ్‌ను నమ్మలేం..
గత కొంతకాలంగా టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ ప్రదర్శన అంత గొప్పగా ఏం లేదు. ముఖ్యంగా పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో అతను తేలిపోతున్నాడు. 10 అంతర్జాతీయ టీ20ల్లో అతను 12 వికెట్లు మాత్రమే తీసాడు. అంతేకాకుండా ధారళంగా పరుగులిచ్చేయడం, ఒత్తిడిని తట్టుకోలేకపోవడం సిరాజ్ బలహీనత.
ఐపీఎల్ 2024 సీజన్‌లోనూ అతను తేలిపోయాడు. ఆర్‌సీబీ తరఫున 14 మ్యాచ్‌ల్లో 15 వికెట్లే తీసాడు. ధారళంగా పరుగులిచ్చుకున్నాడు. ఫస్టాఫ్ సీజన్‌లో అయితే సిరాజ్ దారుణంగా విఫలమయ్యాడు.
అర్ష్‌దీప్ సింగ్ సైతం..
మరో పేసర్ అర్ష్‌దీప్ సింగ్ సైతం నిలకడలేమి ప్రదర్శనతో సతమతమవుతున్నాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో ధారళంగా పరుగులివ్వడం అతని బలహీనత. దాంతో అతనిపై ఆశలు పెట్టుకోలేని పరిస్థితి. ఐపీఎల్ 2024 సీజన్‌లో అర్ష్‌దీప్ సింగ్ 14 మ్యాచ్‌ల్లో 19 వికెట్లతో ఆకట్టుకున్నాడు. కానీ తన ఎకానమీ 10కిపైనే.
వికెట్లు తీసినా పరుగులు నియంత్రించడంలో అర్ష్‌దీప్ సింగ్ విఫలమయ్యాడు. పేస్ ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా, శివమ్ దూబేలపై నమ్మకం ఉంచలేని పరిస్థితి. ఐపీఎల్ 2024 సీజన్‌లో హార్దిక్ పాండ్యా బ్యాటింగ్, బౌలింగ్‌లో తేలిపోయాడు. శివమ్ దూబే కేవలం బ్యాటింగ్‌కు మాత్రమే పరిమితమయ్యాడు.
రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్‌లతో స్పిన్ విభాగం మాత్రం పటిష్టంగా ఉంది. కానీ ప్రపంచకప్ జరిగే అమెరికా, వెస్టిండీస్ పిచ్‌లు పేస్‌కు అనుకూలంగా ఉంటాయి. మరీ భారత స్పిన్నర్లు ఏమేరకు రాణిస్తారో? అనేది చూడాలి. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో అసాధారణ ప్రదర్శన కనబరిస్తేనే టీమిండియా విజేతగా నిలవనుంది.