హైదరాబాద్: చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్ అవ్వడంతో యావత్ భారత్ దేశం సంబరాలు చేసుకుంటుంది. దేశంలో ప్రతీ ఒక్కరు ఈ ప్రయోగం సక్సెస్ అవ్వడం గురించే మాట్లాడుకుంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రయోగం ద్వారా చంద్రుడి దక్షిణ ధ్రువంలో అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ చరిత్రకెక్కింది.
అయితే క్రికెట్ అభిమానులు చంద్రయాన్-3 సక్సెస్‌ను టీమిండియాకు ముడిపెడుతూ.. సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి ప్రారంభమయ్యే వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా విజయం సాధిస్తుందని జోస్యం చెబుతున్నారు. చంద్రయాన్-3 సక్సెస్ భారత్ విజయానికి నిదర్శనమని కామెంట్ చేస్తున్నారు.

2019 వన్డే ప్రపంచకప్ ముందు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం చివరి నిమిషంలో విఫలమైందని గుర్తు చేస్తున్నారు. చంద్రయాన్-2 విఫలమవడంతో ఆ ఏడాది టీమిండియా సెమీస్‌లోనే వెనుదిరిగిందని చెబుతున్నారు. ఈసారి చంద్రయాన్-3 సక్సెస్ సాధించిందని, టీమిండియా కూడా ప్రపంచకప్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సెంటిమెంట్ కచ్చితంగా రిపీట్ అవుతుందని అభిప్రాయపడుతున్నారు.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్ అయ్యింది. 'మామా వచ్చేశాం'అంటూ జాబిల్లిపై చంద్రయాన్-3 అడుగుపెట్టింది. బుధవారం సాయంత్రం 6.03 గంటలకు ల్యాండర్ జాబిల్లిపై దిగ్విజయంగా కాలుమోపి భారత సత్తాను ప్రపంచానికి చాటిచెప్పింది.
ఆంధ్రప్రదేశ్‌లో శ్రీహరికోట నుంచి దూసుకెళ్లిన బాహుబలి రాకెట్ ఎల్‌వీఎం3-ఎం4 విజయవంతంగా భూకక్ష్యలోకి చేరింది. మరుసటి రోజు తొలిసారి దీని కక్ష్యను పెంచారు.
ఇలా 18 రోజుల వ్యవధిలో దశలవారీగా ఐదుసార్లు కక్ష్యను పెంచారు. ఐదో భూకక్ష్య పూర్తయిన వెంటనే చంద్రుడి దిశగా ప్రయాణానికిగానూ ఆగస్ట్ 1న ట్రాన్స్ లూనార్ కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.
ఆగస్టు 5న చంద్రుడి కక్ష్యలోకి చేర్చారు. క్రమంగా చంద్రుడికి చేరువ చేసి ఈ వ్యోమనౌకలోని విక్రమ్ ల్యాంర్, ప్రజ్ఞాన్ రోవర్‌తో కూడిన ల్యాండర్ మాడ్యూల్ ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విజయవంతంగా విడదీసారు. చివరిగా ల్యాండింగ్‌కు అనువైన ప్రదేశాన్ని ఎంచుకొని దిగ్విజయంగా చంద్రుడిపై కాలుమోపారు.