
సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరగనున్న వన్డే సిరీస్‌లో టీమిండియా మరోసారి 28 ఏళ్ల కిందటి రోజులను గుర్తు చేయనుంది. 1992లో ఇదే ఆసీస్ గడ్డపై జరిగిన నాటి వరల్డ్‌కప్‌లో అప్పటి టీమిండియా వేసుకున్న జెర్సీలతోనే కోహ్లీసేన బరిలోకి దిగనుంది. ఈ విషయాన్ని టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ ట్విటర్ వేదికగా తెలియజేశాడు. నాటి జెర్సీ వేసుకున్న ఫొటోను కూడా అభిమానులతో పంచుకున్నాడు. కొత్త జెర్సీతో సిరీస్‌కు సిద్ధంగా ఉన్నామని గబ్బర్ ట్వీట్ చేశాడు.
నేవీ బ్లూ కలర్‌లోని ఈ జెర్సీ భుజాలపై రంగుల చారలు ఉన్నాయి. నిజానికి ఇలా రెట్రో జెర్సీలను ధరించడం ఆస్ట్రేలియానే 2018-19 సిరీస్‌తో మొదలుపెట్టింది. అప్పట్లో 1985 వరల్డ్ సిరీస్ జెర్సీలను ఆసీస్ ప్లేయర్స్ ధరించారు. ఈ ఏడాది మొదట్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ టీమ్స్ రెండూ 1999 వరల్డ్‌కప్ జెర్సీల్లో కనిపించాయి. ఈ నెల 27న మొదలయ్యే వన్డే సిరీస్‌తో ఆస్ట్రేలియాలో టీమిండియా సుదీర్ఘ పర్యటన షురూ కానుంది. సుమారు రెండు నెలలకుపైగా సాగే ఈ టూర్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు జరగనున్నాయి. కరోనా బ్రేక్‌తో సుమారు 9 నెలల తర్వాత భారత జట్టు అంతర్జాతీయ సిరీస్ ఆడుతోంది. గత 2018-19 పర్యటనలో కోహ్లీ సేన ఆస్ట్రేలియాపై 2-1తో టెస్ట్ సిరీస్ నెగ్గి చరిత్ర సృష్టించింది.