
న్యూఢిల్లీ: యూఏఈ వేదికగా టీ20 ప్రపంచకప్ ముగిసిన వారానికే న్యూజిలాండ్.. భారత పర్యటనకు రానుంది. ఈ టూర్‌లో ఇరు జట్ల మధ్య మూడు టీ20లు, రెండు టెస్ట్ మ్యాచ్‌లు జరగనున్నాయి. నవంబర్ 17, 19, 21 తేదీల్లో జరిగే ఈ టీ20 సిరీస్‌కు భారత సీనియర్ క్రికెటర్లు దూరం కానున్నట్లు తెలుస్తోంది. కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, సీనియర్ పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీలకు బీసీసీఐ విశ్రాంతి కల్పించనుంది.
వీరి స్థానాల్లో ఐపీఎల్‌లో రాణించిన వెంకటేశ్ అయ్యర్, హర్షల్ పటేల్, రుతురాజ్ గైక్వాడ్, ఆవేశ్ ఖాన్‌లకు అవకాశం కల్పించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. ఈ మేరకు జాతీయ చానెళ్లు కొన్ని కథనాలను ప్రచురించాయి. జూన్‌లో ఇంగ్లండ్ వేదికగా జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ నుంచి టీమిండియా సీనియర్ సభ్యులు వరుసగా బయోబబుల్‌లో ఉండడమే ఈ మార్పులు చేర్పులకు కారణమన్నట్లు తెలుస్తోంది.
డిసెంబర్‌లో దక్షిణాఫ్రికా పర్యటన నేపథ్యంలో సీనియర్లకు విశ్రాంతి కల్పించాలని బీసీసీఐ సైతం సెలెక్షన్ కమిటీకి సిఫార్సు చేసినట్లు సమాచారం. మరోవైపు టీ20 ప్రపంచకప్ అనంతరం టీమిండియా హెడ్ కోచ్ బాధ్యతల నుంచి తప్పుకోనున్న రవిశాస్త్రి స్థానంలో తాత్కాలిక కోచ్‌గా ఎన్‌సీఏ డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్‌ను నియమించేందుకు కూడా బీసీసీఐ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఇదంతా కార్యరూపం దాల్చితే న్యూజిలాండ్‌తో జరగబోయే టీ20 సిరీస్‌లో ద్రవిడ్ ఆధ్వర్యంలో ఐపీఎల్ సూపర్ హీరోస్ అంతర్జాతీయ అరంగేట్రం చేయనున్నారు.
ఇప్పటికే ప్రయోగాత్మకంగా శ్రీలంక పర్యటనకు రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో భారత జట్టు బీ టీమ్‌ను పంపించి బీసీసీఐ.. ఆశించిన ఫలితాన్ని సాధించింది. ఓ వైపు సీనియర్ ఆటగాళ్లంతా ఇంగ్లండ్ పర్యటనలో ఉండగానే.. శిఖర్ ధావన్ సారథ్యంలో మరో జట్టు శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడింది. ఈ పర్యటనకు ఎంపికైన ప్రతీ ఆటగాడు అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. ఇప్పుడు ఇదే తరహా వ్యూహాన్ని బీసీసీఐ రచించినట్లు తెలుస్తోంది.