
న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) చిక్కుల్లో పడింది. సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలను ఎదుర్కొంటుంది. భారత జట్టులోని ఆటగాళ్ల తిండి విషయంలో బోర్డు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన డైట్ ప్లాన్‌పై నెట్టింట దుమారం రేగుతోంది. న్యూజిలాండ్‌తో గురువారం నుంచి ప్రారంభమయ్యే టెస్టు సిరీస్‌లో పాల్గొనే ఆటగాళ్లు, సిబ్బంది కోసం తయారు చేసిన డైట్ ప్లాన్‌లో.. వారందరూ హలాల్ సర్టిఫైడ్ మాంసాన్ని మాత్రమే తీసుకోవాలని బోర్డు పేర్కొన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో బీసీసీఐ విధానాన్ని వ్యతిరేకిస్తూ #BCCIPromotesHalal అనే ట్యాగ్‌ను ట్విటర్‌లో నెటిజన్లు ట్రెండ్ చేస్తున్నారు.
ఓ జాతీయ వెబ్‌సైట్ కథనం ప్రకారం భారత ఆటగాళ్ల కోసం రూపొందించిన డైట్ మెనూలో హలాల్ మాంసం మాత్రమే ఉండాలని బోర్డు పేర్కొంది. వారి ఆహారంలో ఈ మాంసం తప్ప బీఫ్, ఫోర్క్లాంటివి అసలు ఉండరాదని స్పష్టం చేసింది. హలాల్ మాంసానికి ప్రాధాన్యం ఇవ్వడంపై నెటిజన్లు బీసీసీఐని విమర్శిస్తున్నారు. హిందువులు, సిక్కులు ఈ మాంసానికి దూరంగా ఉంటారని.. అలాంటపుడు ఆటగాళ్ల కోసం హలాల్ మాంసాన్ని ఎలా అందిస్తారంటూ మండిపడుతున్నారు.
న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో కేవలం ఒకే ఒక్క ముస్లిం ఉన్నాడని.. అయినా అందరికీ హలాల్ మాంసాన్ని అందించడమేంటని ప్రశ్నిస్తున్నారు. పరిమిత మోతాదులో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, చాలా తక్కువగా కొవ్వుతో కూడిన ఆహారాన్ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు కోసం తయారు చేయిస్తున్నారు. అలాగే రెడ్ మీట్, వైట్ మీట్ కూడా వీరి మెనూలో ఉందని ఆ వెబ్‌సైట్ పేర్కొంది.
మరోవైపు ఆటగాళ్ల తిండి విషయంలో బీసీసీఐ ఎలాంటి జోక్యం చేసుకోదని బోర్డు ట్రెజరర్ అరుణ్ ధూమల్ స్పష్టం చేశారు. ఈ విమర్శలపై ఇండియా టుడేతో మాట్లాడిన ఆయన.. డైటరీ ప్లాన్ అంటూ వస్తున్న కథనాలను కొట్టిపారేసాడు. ఆటగాళ్లు తమకు నచ్చిన మాంసం తినొచ్చని, ఈ విషయంలో బోర్డు ఎలాంటి ఆంక్షలు, నిబంధనలు విధించలేదన్నాడు. అసలు డైటరీ ప్లాన్ వంటివేం లేవన్నాడు.
'అసలు డైట్ ప్లాన్ గురించి ఇప్పటి వరకు ఎప్పుడూ చర్చించలేదు. అసలు ఈ నిర్ణయం ఎప్పుడు తీసుకున్నారో కూడా నాకు తెలియదు. ఇప్పటి వరకు డైట్ ప్లాన్స్ విషయంలో మేం ఎలాంటి నిబంధనలు విధించలేదు. ఎవరి ఇష్టం మేరకు వారు తమ ఆహారాన్ని తీసుకోవచ్చు. ఈ విషయంలో బీసీసీఐ జోక్యం ఏ మాత్రం లేదు. వెజిటేరియన్, వేగన్, నాన్ వెజిటేరియనా? అనేది ఆటగాళ్ల ఇష్టం.'అని అరుణ్ ధూమల్ పేర్కొన్నాడు.