IND vs SA: సౌతాఫ్రికా కోటలు బద్దలు.. కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ రికార్డుల మోత!

సెంచూరియన్: టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌లో సత్తా చాటకపోయినా సారథిగా దుమ్ములేపాడు. మూడు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా సౌతాఫ్రికాతో సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా 113 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. విరాట్ కోహ్లీ సూపర్ కెప్టెన్సీతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఫీల్డింగ్ సెటప్, బౌలింగ్ మార్పుల్లో చాకచక్యంగా వ్యవహరించిన కోహ్లీ.. ఈ గెలుపుతో కెప్టెన్‌గా పలు ఘనతలను సొంతం చేసుకున్నాడు. సెంచూరియన్ వేదికగా టెస్ట్ మ్యాచ్‌లో విజయం సాధించిన తొలి ఆసియా జట్టుగా భారత్ నిలవగా.. కెప్టెన్‌గా కోహ్లీ కూడా ఆ క్రెడిట్ అందుకున్నాడు. అంతేకాకుండా రెండు బాక్సిండే టెస్ట్‌లు గెలిచిన తొలి భారత కెప్టెన్‌గా గుర్తింపు పొందాడు.

ధోనీ రికార్డు బ్రేక్..
కెప్టెన్‌గా విరాట్ కోహ్లీకి ఇది 40వ విజయం కాగా.. ఈ ఘనతను అందుకున్న నాలుగో కెప్టెన్‌గా రికార్డుకెక్కాడు. అంతేకాకుండా సౌతాఫ్రికా గడ్డపై మూడు ఫార్మాట్లలో కలిపి అత్యధిక విజయాలందుకున్న భారత్ కెప్టెన్‌గా కూడా విరాట్ కోహ్లీ గుర్తింపు పొందాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రికార్డును బ్రేక్ చేశాడు. విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు సఫారీ గడ్డపై 17 విజయాలు సాధించగా.. ధోనీ 16 మ్యాచ్‌లు గెలిచాడు. ఇక సెంచూరియన్ వేదికగా ఓటమెరుగని సౌతాఫ్రికాకు కోహ్లీసేన ఆ రుచి చూపించింది. సఫారీ విజయాల కోటలను బద్దలు చేసింది.

కోహ్లీ ఒక్కడే..
సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా(సెనా) దేశాల్లో అత్యధిక విజయాలు సాధించిన ఆసియా కెప్టెన్ కూడా విరాట్ కోహ్లీనే. ఈ నాలుగు దేశాల్లో కలిపి విరాట్ కోహ్లీ 7 మ్యాచ్‌లు గెలవగా.. పాకిస్థాన్ మాజీ కెప్టెన్లు వసీం అక్రమ్ నాలుగు, జావెద్ మియాందాద్ నాలుగు విజయాలందుకున్నారు. ఇక భారత కెప్టెన్లలో సౌరవ్ గంగూలీ, మహేంద్ర సింగ్ ధోనీ, రాహుల్ ద్రవిడ్‌లు ముగ్గురు కలిపి సేనా దేశాల్లో 7 విజయాలు సాధిస్తే.. విరాట్ ఒక్కడే 7 విజయాలు అందుకున్నాడు. ఈ ఏడాది భారత జట్టు ఓవర్‌సీస్ గడ్డపై బ్రిస్బేన్, ఓవల్, లార్డ్స్, సెంచూరియన్ టెస్ట్‌లు గెలిచింది. భారత క్రికెట్ చరిత్రలోనే విదేశీ గడ్డపై ఇది మెరుగైన ఘనత.

సెన్సేషన్ విక్టరీ..
ఈ విజయంతో సెంచూరియన్ వేదికగా టెస్ట్ మ్యాచ్ గెలిచిన తొలి ఆసియా జట్టుగా కోహ్లీసేన చరిత్ర సృష్టించింది. అంతేకాకుండా మూడు టెస్ట్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. వర్షం కారణంగా కేవలం మూడున్నర రోజుల ఆటనే సాగగా.. భారత్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. 305 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన సౌతాఫ్రికా జట్టు.. 191 పరుగులకే కుప్పకూలింది. ఆతిథ్య జట్టులో కెప్టెన్ డీన్ ఎల్గర్(77), టెంబా బవుమా(35 నాటౌట్) మినహా అంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా (3/50), మహమ్మద్ షమీ(3/63) మూడేసి వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్(2/47), రవిచంద్రన్ అశ్విన్(2/18) రెండేసి వికెట్లు పడగొట్టారు. సూపర్ సెంచరీతో భారత విజయంలో కీలక పాత్ర పోషించిన కేఎల్ రాహుల్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ జనవరి 3 నుంచి జోహన్నెస్ బర్గ్ వేదికగా జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications