ఇంగ్లండ్ పర్యటనను ఓటమితో ప్రారంభించిన టీమిండియా.. మరో ఆసక్తికరపోరుకు సిద్దమైంది. బుధవారం నుంచి బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగే రెండో టెస్ట్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌తో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కాటే గుడ్ న్యూస్ చెప్పాడు. టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉంన్నాడని తెలిపాడు. అతనికి విశ్రాంతి ఇచ్చే విషయంపై తుది నిర్ణయం తీసుకోలేదని చెప్పాడు.
వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా జస్‌ప్రీత్ బుమ్రా ఈ సిరీస్‌లో మూడు మ్యాచ్‌లే ఆడుతాడని టీమిండియా మేనేజ్‌మెంట్ తెలిపింది. ఈ క్రమంలోనే తొలి టెస్ట్ ఆడిన బుమ్రాకు రెండో మ్యాచ్ నుంచి విశ్రాంతి కల్పిస్తారని వార్తలు వచ్చాయి. ఇప్పటికే తొలి టెస్ట్ ఓడిన టీమిండియా 0-1తో వెనుకంజలో నిలిచింది. ఇలాంటి పరిస్థితుల్లో బుమ్రా రెండో టెస్ట్ ఆడకపోతే తీవ్ర నష్టం జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సోమవారం మీడియాతో మాట్లాడిన ర్యాన్ టెన్ డస్కాటే.. బుమ్రా రెండో టెస్ట్ ఆడుతాడని తెలిపాడు.

'జస్‌ప్రీత్ బుమ్రా ఖచ్చితంగా రెండో టెస్ట్‌కు అందుబాటులో ఉంటాడు. అతను ఐదు మ్యాచ్‌ల్లో మూడే ఆడుతాడనే విషయం అందరికి తెలిసిందే. అయితే తొలి టెస్ట్ తర్వాత కోలుకోవడానికి అతనికి 8 రోజుల విశ్రాంతి లభించింది. కానీ.. పరిస్థితులు, వర్క్‌లోడ్ దృష్టిలో ఉంచుకొని తదుపరి నాలుగు మ్యాచ్‌ల్లో ఎలా ముందుకు వెళ్లాలనే విషయంపై ఆలోచనలు చేస్తున్నాం. బుమ్రా విశ్రాంతి విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇతర ఆటగాళ్ల వర్క్‌లోడ్‌పై కూడా ఫోకస్ పెట్టాం. ప్రస్తుతానికి బుమ్రా టీమ్ సెలెక్షన్‌కు అందుబాటులో ఉన్నాడు. ఈ టెస్ట్‌ను ఆడించడం ద్వారా జట్టుకు లాభం జరుగుతుందని భావిస్తే బుమ్రాను ఆడిస్తాం. వాతావరణ, పిచ్ ఎలా ఉందనే విషయాన్ని బట్టి తుది నిర్ణయం తీసుకుంటాం. అవసరమైతే ఇద్దరు స్పిన్నర్లతో కూడా బరిలోకి దిగుతాం.'అని ర్యాన్ టెన్ డస్కాటే తెలిపాడు.
ఎడ్జ్‌బాస్టన్ పిచ్ సాంప్రదాయకంగా పేస్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా తొలి రెండు రోజులు పేస్‌కు సహకరిస్తోంది. వాతావరణం చల్లగా ఉండి, పిచ్‌పై పచ్చ గడ్డి ఉంటే బంతి స్వింగ్ అవుతోంది. మ్యాచ్ సాగుతున్నా కొద్ది పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారుతోంది. ఆట ఆఖరి రోజుకు చేరితే పిచ్‌పై పగుళ్లు ఏర్పడి స్పిన్‌కు అనుకూలిస్తోంది. ఇక్క టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకోవడానికి మొగ్గు చూపుతోంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలో రెండో టెస్ట్‌లో బుమ్రా ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.