హైదరాబాద్: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్ అయ్యింది. 'మామా వచ్చేశాం'అంటూ జాబిల్లిపై చంద్రయాన్-3 అడుగుపెట్టింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో 140 కోట్ల భారతీయుల మనసులు ఉప్పొంగాయి. బుధవారం సాయంత్రం 6.03 గంటలకు ల్యాండర్ జాబిల్లిపై దిగ్విజయంగా కాలుమోపి భారత సత్తాను ప్రపంచానికి చాటిచెప్పింది.
దాంతో యావత్ భారతం సంతోషంతో ఉప్పొంగింది. దేశ ప్రధాని నుంచి సామన్య పౌరుడి వరకు ఈ ప్రయోగం విజయవంతమవడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏ సోషల్ మీడియా వేదికను చూసినా.. ఎవరి స్టేటస్ పరిశీలించినా.. చంద్రయాన్ ప్రయోగం సక్సెస్ గురించే చర్చించుకుంటున్నారు. భారత శాస్త్రవేత్తలకు అభినందనలు తెలియజేస్తున్నారు.

ప్రయోగం సక్సెస్ అయిందనే సంతోషంతో సంబరాలు చేసుకుంటున్నారు. చంద్రయాన్-3 ల్యాండర్ చంద్రుడిపై కాలుమోపడాన్ని టీవీలో ప్రత్యక్షంగా వీక్షించిన టీమిండియా ఆటగాళ్లు సంతోషంతో సంబరాలు చేసుకున్నారు. ఐర్లాండ్‌తో మూడో టీ20 మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుండగా.. భారత ఆటగాళ్లంతా.. చంద్రయాన్-3 ప్రయోగ సక్సెస్‌ను టీవీలో వీక్షించారు.
ల్యాండర్ చంద్రుడిపై కాలుమోపిన వెంటనే చప్పట్లో భారత శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ఈ వీడియోను బీసీసీఐ ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో శ్రీహరికోట నుంచి దూసుకెళ్లిన బాహుబలి రాకెట్ ఎల్‌వీఎం3-ఎం4 విజయవంతంగా భూకక్ష్యలోకి చేరింది. మరుసటి రోజు తొలిసారి దీని కక్ష్యను పెంచారు.
ఇలా 18 రోజుల వ్యవధిలో దశలవారీగా ఐదుసార్లు కక్ష్యను పెంచారు. ఐదో భూకక్ష్య పూర్తయిన వెంటనే చంద్రుడి దిశగా ప్రయాణానికిగానూ ఆగస్ట్ 1న ట్రాన్స్ లూనార్ కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.
ఆగస్టు 5న చంద్రుడి కక్ష్యలోకి చేర్చారు. క్రమంగా చంద్రుడికి చేరువ చేసి ఈ వ్యోమనౌకలోని విక్రమ్ ల్యాంర్, ప్రజ్ఞాన్ రోవర్‌తో కూడిన ల్యాండర్ మాడ్యూల్ ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విజయవంతంగా విడదీసారు. చివరిగా ల్యాండింగ్‌కు అనువైన ప్రదేశాన్ని ఎంచుకొని దిగ్విజయంగా చంద్రుడిపై కాలుమోపారు.