శతక్కొట్టిన బళ్లెం రాణి.. కథ వింటే కన్నీళ్లే!
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో సౌతాఫ్రికా తొలి విజయాన్నందుకుంది. న్యూజిలాండ్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఓపెనర్ టాజ్మిన్ బ్రిట్స్(89 బంతుల్లో 15 ఫోర్లు, సిక్స్‌తో 101) సూపర్ సెంచరీతో సౌతాఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే టాజ్మిన్ బ్రిట్స్.. జావెలిన్ త్రోయర్‌లో గోల్డ్ మెడలిస్ట్. 2007 వరల్డ్ యూత్ ఛాంపియన్‌షిప్‌లో ఈ బళ్లెం వనిత బంగారు పతకం సాధించింది.
2010 వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం గెలిచింది. ఆ తర్వాత అనూహ్యంగా సౌతాఫ్రికా క్రికెట్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన టాజ్మిన్ బ్రిట్స్.. గత ఐదు వన్డేల్లో 4 శతకాలు నమోదు చేసింది. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో సెంచరీ ముగిసిన వెంటనే జావెలిన్ త్రోయర్‌తో బాణం సంధించినట్లు సంబరాలు చేసుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

రోడ్డు ప్రమాదంతో చెదిరిన ఒలింపిక్ కల..
టాజ్మిన్ బ్రిట్స్ క్రీడా ప్రయాణం ఒక విషాదకరమైన సంఘటనతో క్రికెట్‌వైపు మలుపు తిరిగింది. జావెలిన్ త్రోయర్‌గా కెరీర్ ప్రారంభించిన టాజ్మిన్ బ్రిట్స్.. 16 ఏళ్ల వయసులోనే ప్రపంచ అథ్లెటిక్స్ యూత్ ఛాంపియన్‌షిప్స్‌లో బంగారు పతకం సాధించింది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించడమే లక్ష్యంగా సిద్దమైంది. దాదాపు ఆ లక్ష్యానికి సమీపించింది. కానీ లండన్ ఒలింపిక్స్‌కు కొన్ని నెలల ముందు బ్రిట్స్ ఘోర కారు ప్రమాదానికి గురైంది.
ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. హిప్,పెల్విస్ ఎముకలు విరిగిపోయాయి. దాంతో ఆమె రెండు నెలల పాటు ఆసుపత్రిలోనే గడపాల్సి వచ్చింది. ఈ ప్రమాదం కారణంగా తన ఒలింపిక్ కల చెదిరింది. రోడ్డు ప్రమాదంలో అచేన స్థితిలో ఉన్న ఆమెను చూసి నడవడం కూడా కష్టమని అంతా అనుకున్నారు.
ఉపశమనం కోసం క్రికెట్ ఆడి..
ప్రమాద గాయాల నుంచి కోలుకున్నా.. ఒలింపిక్ మెడల్ సాధించలేదనే బాధ ఆమెను వెంటాడింది. నిరాశలో ఉన్న టాజ్మిన్ బ్రిట్స్‌ను మాములు మనిషిని చేసేందుకు ఆమె స్నేహితుడు క్రికెట్ ఆడించాడు. ఈ ఆట ఆమెకు కాస్త ఉపశమనాన్ని ఇచ్చింది. ప్రమాదం నుంచి పూర్తిగా కోలుకున్న బ్రిట్స్.. బ్యాటర్‌గా సత్తా చాటడంతో క్రికెట్‌నే కెరీర్‌గా ఎంచుకుంది.
క్రికెట్‌లో మెరుగైన ప్రదర్శన చేయడంతో 2018లో సౌతాఫ్రికా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసింది. క్రీడలంటే ఇష్టపడే బ్రిట్స్.. జావెలిన్ త్రోయర్‌గా సక్సెస్ కాకపోయినా.. విధి పెట్టిన పరీక్షలో విఫలమైనా.. క్రీడలపై తనకున్న మక్కువను మాత్రం చంపుకోలేదు. క్రికెట్‌ను రెండో అవకాశంగా భావించి సత్తా చాటింది. సౌతాఫ్రికా టాప్ బ్యాటర్‌గా ఎదిగింది.
మహిళల వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా ఏడు సెంచరీలు చేసిన బ్యాటర్‌గా మెగ్ లానింగ్‌తో సహా పలు రికార్డులను బద్దలుకొట్టింది. ప్రస్తుతం మహిళల వన్డే ప్రపంచకప్‌లో సూపర్ ఫామ్‌లో ఉంది. జావెలిన్ త్రోయర్ నుంచి క్రికెటర్‌గా ఎదిగిన టాజ్మిన్ బ్రిట్స్ ప్రయాణం స్ఫూర్తి దాయకం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications