
కాబుల్: తాలిబన్ల వశమైన అఫ్గానిస్థాన్‌లో ఐపీఎల్ 2021 సెకండాఫ్ లీగ్ ప్రసారాలపై నిషేధం విధించారు. ఈ మేరకు అఫ్గానిస్థాన్ మీడియా సంస్థలకు తాలిబన్ల ప్రభుత్వం హెచ్చరికలు కూడా జారీ చేసింది. డ్యాన్సర్లతో పాటు మహిళలు హాజరయ్యే ఐపీఎల్ 2021 మ్యాచ్‌లను ఎట్టిపరిస్థితుల్లో ప్రసారం చేయవద్దని పేర్కొంది. ఇది తమ మతకట్టుబాట్లకు విరుద్దమని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని అఫ్గాన్ జర్నలిస్ట్ ఫవాద్ అమన్ ట్విటర్ వేదికగా వెల్లడించారు. 'అఫ్గానిస్థాన్‌లో ఐపీఎల్ 2021 సెకండాఫ్ లీగ్ ప్రసారాలపై తాలిబన్లు నిషేధం విధించారు. ఐపీఎల్ జరుగుతున్న స్టేడియాల్లో మహిళా ప్రేక్షకులు ఉండటం, వారిలో పలువురు డ్యాన్స్ చేస్తున్నారనే కారణంతో మ్యాచ్‌లను ప్రసారం చేయవద్దని అఫ్గాన్ మీడియా సంస్థలకు తాలిబన్లు హెచ్చరికలు జారీ చేశారు'అని ఆయన ట్వీట్ చేశారు.
యూఏఈ వేదికగా జరగుతున్న ఐపీఎల్ రెండో దశ లీగ్‌లో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఈ ధనాధన్ లీగ్‌ను అస్వాదిస్తుంటే తాలిబన్ల నిరంకుశత్వ పాలన వల్ల అఫ్గాన్ ప్రజలు చూడలేకపోతున్నారు. ఇప్పటికే పలు వినోదాత్మక కార్యక్రమాలపై తాలిబాన్లు ఆంక్షలు విధించడంతో పాటు బ్యాన్ చేశారు. మహిళలు ఏ ఆటలు కూడా ఆడకుండా పూర్తిగా నిషేధించారు. అఫ్గాన్‌కు చెందిన రషీద్ ఖాన్, మహమ్మద్ నబీతో పాటు ముజీబ్ ఉర్ రెహ్మాన్ ఐపీఎల్ 2021 సీజన్ ఆడుతున్నారు. తాలిబన్ల నిరంకుశత్వ నిర్ణయం వల్ల తమ అభిమాన ఆటగాళ్ల మ్యాచ్‌లను చూడలేకపోతున్నామని అఫ్గాన్ క్రికెట్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇక తమ రాజ్యంలో మహిళలు ఇస్లాం నిబంధనలకు కట్టుబడి ఉండాలని తాలిబన్లు ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే మహిళా క్రికెట్‌ను నిషేధించారు. పురుషుల క్రికెట్ జట్టును మాత్రమే ఆడేందుకు అనుమతిస్తామని, మహిళా జట్టును మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుమతించమన్నారు. ఈ అంశంపై తాలిబన్ కల్చరల్ నేత అహ్మదుల్లా వాసిక్ ఆస్ట్రేలియన్ ఛానల్ ఎస్‌బీఎస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మహిళలు క్రికెట్ ఆడరని, ఇదే కాదు ఏ ఆట కూడా వాళ్లు ఆడబోరన్నారు. మహిళలు క్రికెట్ ఆడాల్సినంత అవసరం లేదన్నారు. క్రికెట్ ఆడుతున్న సమయంలో ముఖం, శరీరం బహిర్గతం అవుతుందని.. ఇస్లాం ప్రకారం మహిళల్ని తాము ఇలా చూడలేమన్నారు.
మహిళలు క్రికెట్ ఆడేందుకు తాలిబన్లు విముఖత చూపితే పురుషుల జట్టుతో నవంబర్‌లో జరగాల్సిన టెస్టు మ్యాచ్ రద్దు చేస్తామని ఇదివరకే ఆస్ట్రేలియా హెచ్చరించింది. ఆసీస్ టెస్టు కెప్టెన్ టిమ్ పైన్ కూడా టీ20 ప్రపంచకప్ నుంచి అఫ్గాన్‌ను తప్పించాలని పేర్కొన్నాడు. అయితే తాలిబన్ల ప్రకటన ఆధారంగా పురుషుల జట్టును శిక్షించవద్దని అఫ్గాన్ క్రికెట్ బోర్డు ఆస్ట్రేలియాను కోరింది.