టీ20 ప్రపంచకప్ భవితవ్యంపై రాని స్పష్టత.. మరో నెల ఆగాలి!!

దుబాయ్: ఆస్ట్రేలియాలో జరగాల్సిన టీ20 ప్రపంచకప్ నిర్వహణపై ఇప్పట్లో స్పష్టత వచ్చేలా కనిపించడం లేదు. విశ్వవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతుండటంతో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మరోసారి వాయిదా పాటనే అందుకుంది. బుధవారం మూడు గంటలకు పైగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమావేశంలో ఐసీసీ ఎలాంటి స్పష్టమైన నిర్ణయం ప్రకటించలేదు.

పూర్తి అవగాహనతో నిర్ణయం తీసుకుంటాం
ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15 వరకు జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌పై వచ్చే నెలలో నిర్ణయం తీసుకోనున్నట్లు ఐసీసీ పేర్కొంది. 'టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌పై మేం సరైన నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం తీసుకోవడానికి ఒక్క అవకాశమే ఉంటుంది. అందుకే అది మంచి నిర్ణయమై ఉండాలి. మా సభ్య దేశాలు, ప్రసారదారు, భాగస్వాములు, ప్రభుత్వాలు, ఆటగాళ్లతో సంప్రదింపులను కొనసాగిస్తాం. పూర్తి అవగాహనతో నిర్ణయం తీసుకుంటాం' అని ఐసీసీ ముఖ్యకార్యనిర్వహణ అధికారి మను సాహ్ని ఓ ప్రకటనలో తెలిపాడు.

ఆటగాళ్ల ఆరోగ్య భద్రతే ముఖ్యం
టీ20 ప్రపంచకప్‌తో పాటు 2021లో జరగాల్సిన మహిళల వన్డే ప్రపంచకప్‌ల నిర్వహణకు సంబంధించిన ప్రణాళికలతో పాటు ఇతర ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నామని ఐసీసీ పేర్కొంది. కరోనా వైరస్తో ప్రపంచం అతలాకుతలం అవుతున్న నేపథ్యంలో.. ఆటగాళ్ల ఆరోగ్య భద్రత విషయంలో ఎలాంటి తొందరపాటు చర్యలకు పాల్పడబోమని స్పష్టం చేసింది. మరోవైపు.. ప్రస్తుత ఐసీసీ చైర్మన్ శశాంక్ మనోహర్ పదవీ కాలం ఈ నెలతో ముగుస్తుంది. అంటే ప్రపంచకప్‌పై నిర్ణయం కొత్త చైర్మన్ తీసుకొనే అవకాశం ఉంది. కానీ చైర్మన్ ఎన్నికల నామినేషన్ల విషయమై ఈ సమావేశంలో ఎటువంటి స్పష్టత రాలేదు.

ప్రపంచకప్ నిర్వహణపై సీఏ మల్లగుల్లాలు
కరోనా వైరస్ ముప్పు వల్ల స్వయంగా క్రికెట్ ఆస్ట్రేలియానే (సీఏ) ప్రపంచకప్ నిర్వహణపై మల్లగుల్లాలు పడుతున్న నేపథ్యంలో ఆ టోర్నీ వాయిదా పడక తప్పక పోవచ్చని ఇప్పటికే చాలా మంది మాజీ, ప్రస్తుత ఆటగాళ్లు అభిప్రాయపడ్డారు. టోర్నీ వాయిదా పడితే ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్) 2020కు మార్గం సుగమమవుతుంది. అయితే ఆస్టేలియా క్రీడల మంత్రి కోల్‌బెక్ తమ దేశంలో ఆరోగ్య పరిస్థితుల గురించి సానుకూల సందేశం పంపడం కూడా ఐసీసీ నిర్ణయం వాయిదా పడడానికి కారణమని భావిస్తున్నారు.

బీసీసీఐకి మరింత గడువు
పన్ను మినహాయింపుపై బీసీసీఐ, ఐసీసీకి మధ్య జరుగుతున్న గొడవ ప్రస్తుతానికి సద్దుమణిగింది. ప్రపంచకప్ లాంటి ఐసీసీ ఈవెంట్లకు భారత ప్రభుత్వం నుంచి బీసీసీఐ పన్ను మినహాయింపు తెచ్చుకోవడానికి గడువును ఐసీసీ డిసెంబరు వరకు పొడిగించింది. మరోవైపు తమ రహస్యాలు బయటికి పొక్కడంపై విచారణను కొనసాగించాలని ఐసీసీ నిర్ణయించింది. దీంతో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి కొంత ఊరట దక్కిందనే చెప్పుకోవాలి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
సంజీత డోపీ కాదు.. క్షమాపణ, పరిహారం కోరిన లిఫ్టర్!!