
షార్జా: టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఆ జట్టు సూపర్ 12 లో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో గెలిచి గ్రూప్ 1 టాపర్‌గా నిలిచింది. అందరికన్నా ముందే సెమీస్ చేరిన బాబర్ సేన.. ఆదివారం స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించి 72 పరుగుల భారీ తేడాతో విజయాన్నందుకుంది. ఈ ఐదు విజయాలతో నాకౌట్ మ్యాచ్‌లకు ముందు తమ ఆత్మవిశ్వాసాన్ని ఆమాంతం పెంచుకుంది. ఐదు ఓటములతో స్కాట్లాండ్ పాయింట్ల ఖాతానే తెరువలేకపోయింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 189 పరుగులు చేసింది.
కెప్టెన్ బాబర్ ఆజమ్(47 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 66) హాఫ్ సెంచరీతో తన ఫామ్ కొనసాగించగా.. వెటరన్ క్రికెటర్ షోయబ్ మాలిక్(18 బంతుల్లో ఫోర్, 6 సిక్సర్లతో 54 నాటౌట్) మెరుపు హాఫ్ సెంచరీ బాదాడు. ఈ ఇద్దరికి మధ్యలో మహమ్మద్ హఫీజ్(31) కూడా రాణించాడు. చివరి ఓవర్లోనే మాలిక్ 26 పరుగులు పిండుకోవడం విశేషం. స్కాట్లాండ్ బౌలర్లలో క్రిస్ గ్రేవ్స్(1/43) రెండు వికెట్లు తీశాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన స్కాట్లాండ్ ఓవర్లన్నీ ఆడి 6 వికెట్లకు 117 పరుగులు మాత్రమే చేసింది. బెరింగ్టన్(54 నాటౌట్) టాప్ స్కోరర్. పాక్ బౌలర్లలో షాదాబ్ ఖాన్(2/14) రెండు వికెట్లతో రాణించాడు. పాక్ బౌలర్ల దెబ్బకు స్కాట్లాండ్ ఏ దశలోనూ విజయం దిశగా పయనించలేదు. బారింగ్టన్ అర్ధసెంచరీ చేయకపోతే ఆ జట్టు ఆ మాత్రం స్కోరు కూడా చేసేది కాదు.
మెరుపు హాఫ్ సెంచరీ బాదిన షోయబ్ మాలిక్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.
ఈ మ్యాచ్‌లో పాక్ టాస్ గెలవగానే బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి పది ఓవర్లలో 60 పరుగులే చేసినా, బాబర్ నిలకడ, షోయబ్ తుఫాన్ ఇన్నింగ్స్‌తో ఆఖరి 8 ఓవర్లలో 114 పరుగులు రాబట్టింది. 40 బంతుల్లో అర్ధసెంచరీ చేసిన బాబర్ 18వ ఓవర్‌లో వెనుదిరిగినా.. షోయబ్ మాత్రం ధాటిగా ఆడాడు. 19వ ఓవర్‌లో రెండు సిక్సర్లు బాదిన తను ఆఖరి ఓవర్‌లో స్పిన్నర్ గ్రీవ్స్‌ను వణికిస్తూ వరుసగా 6,4,6,6తో 18 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో పాక్ తరఫున ఫాస్టెస్ట్ ఫిఫ్టీ (18 బంతుల్లో) సాధించిన షోయబ్ మాలిక్. ఇక టీ20 ప్రపంచకప్‌ల్లో కేఎల్ రాహుల్, మ్యాక్స్‌వెల్‌తో కలిసి మూడో స్థానంలో ఉన్నాడు.
సంక్షిప్త స్కోర్లు:
పాకిస్థాన్: 20 ఓవర్లలో 189/4 (బాబర్ అజామ్ 66, షోయబ్ మాలిక్ 54 నాటౌట్, హఫీజ్ 31; గ్రీవ్స్ 2/43);
స్కాట్లాండ్: 20 ఓవర్లలో 117/6 (రిచీ బారింగ్టన్ 54 నాటౌట్; షాదాబ్‌ఖాన్ 2/14)