ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో జింబాబ్వే మరో సంచలనాన్ని నమోదు చేసింది. ఇప్పటికే ఆస్ట్రేలియా ఓడించి ఇంటికి పంపించిన జింబాబ్వే.. తాజాగా శ్రీలంకను మట్టికరిపించింది. గ్రూప్-బీలో భాగంగా కొలంబో వేదికగా గురువారం జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన జింబాబ్వే 6 వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించింది. ఈ గెలుపుతో గ్రూప్-బీ టాపర్‌గా సూపర్-8 అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లో ఓడినా ఇప్పటికే శ్రీలంక సూపర్-8 చేరిన సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 178 పరుగులు చేసింది. ఓపెనర్ శ్రీలంక పాతుమ్ నిస్సంక(41 బంతుల్లో 8 ఫోర్లతో 62) హాఫ్ సెంచరీతో రాణించగా.. పవన్ రత్నాయకే(25 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 44) పర్వాలేదనిపించాడు. జింబాబ్వే బౌలర్లలో ముజర్బాని, బ్రాడ్ ఇవాన్స్, గ్రేమ్ క్రీమర్ తలో రెండు వికెట్లు తీయగా.. ర్యాన్ బర్ల్ ఒక వికెట్ పడగొట్టాడు.

అనంతరం జింబాబ్వే 19.3 ఓవర్లలో 4 వికెట్లకు 182 పరుగులు చేసింది. బ్రియాన్ బెన్నెట్(48 బంతుల్లో 8 ఫోర్లతో 63 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. కెప్టెన్‌గా సికిందర్ రాజా(26 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 45) విలువైన పరుగులు చేశాడు. శ్రీలంక బౌలర్లలో దుషన్ హేమంత రెండు వికెట్లు తీయగా.. డసన్ షనక, దునిత్ వెల్లలేగ చెరో వికెట్ పడగొట్టారు.
లక్ష్య ఛేదనలో జింబాబ్వేకు అదిరిపోయే ఆరంభం దక్కింది. ఓపెనర్లు బ్రియాన్ బెన్నెట్, మరుమణి తొలి వికెట్‌కు 69 పరుగులు జోడించారు. మరుమణి(34) ఔటైనా.. ర్యాన్ బర్ల్(23)తో బ్రియాన్ బెన్నెట్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ర్యాన్ బర్ల్ ఔటైనా.. కెప్టెన్ సికిందర్ రాజా దూకుడుగా ఆడాడు. వేగంగా ఆడే క్రమంలో అతను ఔటైనా.. బెన్నెట్ ఆచితూచి ఆడాడు. 41 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అతను తీక్షణ వేసిన ఆఖరి ఓవర్‌లో బౌండరీ బాది మరో రెండు బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందించాడు.
సూపర్-8లో జింబాబ్వే భారత్, వెస్టిండీస్, సౌతాఫ్రికాతో గ్రూప్-1లో ఉంది. తమ తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 23న వెస్టిండీస్‌తో ముంబై వేదికగా ఆడనుంది. ఫిబ్రవరి 26న చెన్నై వేదికగా భారత్‌తో, మార్చి1న సౌతాఫ్రికాతో తమ చివరి సూపర్-8 మ్యాచ్ ఆడనుంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2022 తర్వాత జింబాబ్వే లీగ్ దశ దాటడం ఇదే రెండోసారి మాత్రమే. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2022 టోర్నీలో సూపర్-12లో పాకిస్థాన్‌ను జింబాబ్వే ఓడించింది.