ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీ బరిలోకి దిగిన అమెరికా జట్టును ఎన్‌ఆర్‌ఐ(ప్రవాస భారతీయుల)టీమ్‌గా పిలవవచ్చు. ఎందుకంటే ఈ జట్టులో దాదాపు 9 మంది భారత సంతతి ఆటగాళ్లు ఉన్నారు. అంతేకాదు అందులో ఒకరిద్దరూ మినహా మిగతా వారంతా భారత దేశవాళీ క్రికెట్ ఆడినవారే కావడం గమనార్హం. చివరకు అమెరికా కెప్టెన్ మోనాంక్ పటేల్ కూడా భారత్‌కు చెందినవాడే. గుజరాత్ తరఫున అండర్ 16, అండర్ 19 క్రికెట్ ఆడాడు.
భారత క్రికెట్‌లో నెలకొన్న పోటీతో అవకాశాలు రాక వారు అమెరికా పౌరసత్వం తీసుకొని ఆ జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నారు. దాంతోనే భారత్‌తో ముంబై వేదికగా జరిగిన తమ తొలి మ్యాచ్‌లో ఈ ఎన్‌ఆర్‌ఐ ఆటగాళ్లు నిప్పులు చెరిగారు. విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగే భారత ఆటగాళ్లకు ఊహించని షాకిచ్చారు. ఈ క్రమంలోనే అమెరికా జట్టులోని భారత సంతతి ఆటగాళ్ల పూర్తి వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

అమెరికా కెప్టెన్ అయిన మోనాంక్ పటేల్ గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాకు చెందినవాడు. అతను గుజరాత్ తరఫున అండర్-16, అండర్-19 క్రికెట్ ఆడాడు.
మహారాష్ట్రలోని ముంబైకి చెందిన సౌరభ్ నేత్రావల్కర్.. ముంబై మాజీ రంజీ ప్లేయర్. 2010 అండర్-19 వరల్డ్ కప్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. సౌరబ్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. ముంబైలో చదువు పూర్తి చేసిన తర్వాత, అమెరికాలోని ప్రతిష్టాత్మక కార్నెల్ యూనివర్సిటీలో మాస్టర్స్ చేశాడు. ప్రస్తుతం ఆయన అమెరికాలోని ప్రముఖ టెక్ సంస్థ ఒరాకిల్ సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తూనే.. అమెరికా జట్టులో కీలక బౌలర్‌గా రాణిస్తున్నాడు.
మహారాష్ట్రలోని ముంబైకి చెందిన హర్మీత్ సింగ్ కూడా ముంబై జట్టు తరఫున రంజీ క్రికెట్ ఆడాడు. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోనూ అతను కొన్ని మ్యాచ్‌ల్లో బరిలోకి దిగాడు. 2012లో ప్రపంచకప్ గెలిచిన భారత అండర్-19 జట్టులో సభ్యుడుగా కూడా ఉన్నాడు. అమెరికా జట్టులో స్పిన్నర్‌గా సత్తా చాటుతున్నాడు. భారత్‌తో మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్‌లను పెవిలియన్ చేర్చాడు.
ఢిల్లీకి చెందిన మిలింద్ కుమార్.. గతంలో ఢిల్లీ, సిక్కిం తరఫున రంజీ మ్యాచ్‌లు ఆడాడు. ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్, ఆర్సీబీ జట్లలో కూడా సభ్యుడిగా కొనసాగాడు.
మహారాష్ట్రలోని ముంబైకి చెందిన శుభం రంజే.. ముంబై తరఫున రంజీ క్రికెట్ ఆడాడు. ఇతను కూడా సూర్య సారథ్యంలోనే రంజీ మ్యాచ్‌లు ఆడాడు. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కూడా ఎంపికయ్యాడు.
అమెరికాలోనే స్థిరపడిన తెలుగు కుటుంబానికి చెందిన యువ బ్యాటర్ సాయితేజ ముక్కామల్ల. వారి తల్లిదండ్రుల స్వస్థలం ఆంధ్రప్రదేశ్.
కర్ణాటకకు చెందిన సంజయ్ కృష్ణమూర్తి.. బెంగళూరులో క్రికెట్ ఓనమాలు నేర్చుకున్నాడు. ఆ తర్వాత అమెరికాకు వెళ్లి ఆ జాతీయ జట్టు తరఫున ఆల్‌రౌండర్‌గా రాణిస్తున్నాడు.
కర్ణాటకలోని చిక్కమగళూరుకు చెందిన నోష్తుష్ కెంజిగే అమెరికా వెళ్లాడు.
జెస్సీ సింగ్ అమెరికాలోని న్యూయార్క్‌లో జన్మించినప్పటికీ, అతని కుటుంబ మూలాలు భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రంలో ఉన్నాయి.
మిగతా ఆరుగురిలో ముగ్గురు పాక్ సంతతి ఆటగాళ్లు కాగా.. మరో ఇద్దరూ సౌతాఫ్రికా సంతతి ప్లేయర్లు ఉన్నారు. ఒకరు శ్రీలంక సంతతి ఆటగాడు కావడం గమనార్హం. దీంతోనే ఇది అమెరికా జట్టు కాదు ఎన్‌ఆర్‌టై టీమ్ అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
మొనాంక్ పటేల్, సౌరభ్ నేత్రావల్కర్ (బౌలర్), ఆండ్రీస్ గౌస్ (బ్యాటర్), అలీ ఖాన్ (బౌలర్), జెస్సీ సింగ్, షెహాన్ జయసూర్య, మిలింద్ కుమార్, షాయన్ జహంగీర్, సాయితేజ ముక్కామల, సంజయ్ కృష్ణమూర్తి, హర్మీత్ సింగ్, నోస్తుష్ కెంజిగే, షాడ్లీ వాన్ షాల్క్విక్, మహమ్మద్ మొహ్సిన్, శుభం రంజనే.