అప్‌కమింగ్ ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీకి టీమిండియా అన్ని విధాల సిద్దమైంది. ఈ మెగా టోర్నీకి చివరి సన్నదతగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌ను టీమిండియా మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. ఇప్పటి వరకు జరిగిన మూడు టీ20ల్లో పూర్తి ఆధిపత్యం చెలాయించి ఏకపక్ష విజయాలను సాధించింది. ముఖ్యంగా గౌహతి వేదికగా జరిగిన మూడో టీ20లో 154 పరుగుల లక్ష్యాన్ని 10 ఓవర్లలోనే ఛేదించి ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టించింది.
భీకర బ్యాటింగ్ లైనప్‌కు ఫిదా అయిన దిగ్గజ క్రికెటర్లు గవాస్కర్, సైమన్ డౌల్.. టీమిండియాకు టీమిండియానే పోటీ అని కొనియాడారు. విధ్వంసకర బ్యాటింగ్.. మెరుపులాంటి ఫీల్డింగ్, కత్తిలాంటి బౌలింగ్‌తో సమతూకంగా కనిపిస్తున్న టీమిండియాకు మెగా టోర్నీలో మూడు జట్లతో ముప్పు పొంచి ఉంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే ఏ హోమ్ జట్టు టైటిల్ గెలవలేదు. ఈ రికార్డ్ కూడా భారత్‌ను కలవరపెడుతోంది. మెగా టోర్నీ లీగ్ దశలో టీమిండియాకు తిరుగులేకున్నా.. సూపర్-8లో గట్టి పోటీ ఎదురు కానుంది. భారత జట్టుకు గట్టి పోటీనిచ్చే జట్లపై ఓ లుక్కెద్దాం.

నమీబియా, నెదర్లాండ్స్, అమెరికా, పాకిస్థాన్‌లతో గ్రూప్-ఏలో ఉన్న ఆతిథ్య భారత్ ఈజీగా సూపర్-8కు అర్హత సాధిస్తోంది. పాకిస్థాన్‌తో కాస్త పోటీ ఎదురైనా.. గతంతో పాటు ఇటీవల రికార్డ్‌లను పరిగణలోకి తీసుకుంటే టీమిండియాదే పైచేయిగా కనిపిస్తోంది. సూపర్-8లో టీమిండియాకు ఆస్ట్రేలియా గట్టి పోటీనిచ్చే అవకాశం ఉంది. ఐసీసీ టోర్నీల్లో ఆస్ట్రేలియాను ఎప్పుడూ తక్కువ అంచనా వేయలేం. ముఖ్యంగా ఆసియా పిచ్‌లపై ఆసీస్ దుమ్మురేపుతోంది.
ఆడమ్ జంపా వంటి నాణ్యమైన స్పిన్నర్‌తో పాటు ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ వంటి డేంజరస్ హిట్టర్లు ఆ జట్టులో ఉన్నారు. తీవ్ర ఒత్తిడిలోనూ రాణించడం వారికి వెన్నతో పెట్టిన విద్య. భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ 2023లో టీమిండియాను ఓడించే ఆసీస్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. మరోసారి అదే ఫలితాన్ని రిపీట్ చేసి విశ్వవిజేతగా నిలవాలనే పట్టుదలతో ఆసీస్ ఉంది. ఐపీఎల్ కారణంగా ఇక్కడి పిచ్‌లపై ఆసీస్ ఆటగాళ్లకు మంచి పట్టు ఉంది. ఈ క్రమంలోనే టీమిండియాకు ఆసీస్ గట్టి పోటీదారి కానుంది.
పొట్టి ఫార్మాట్‌లో భారత్ తరహాలోనే అత్యంత దూకుడుగా ఆడే జట్టు ఇంగ్లండ్. హ్యారీ బ్రూక్ సారథ్యంలో ఆ జట్టు భీకరంగా కనిపిస్తోంది. జోస్ బట్లర్, లియామ్ లివింగ్ స్టోన్ వంటి హిట్టర్లతో ఇంగ్లండ్ బలంగా ఉంది. ఎంత పెద్ద లక్ష్యాన్ని అయినా ఛేదించడంలో వారు దిట్ట. ఐపీఎల్ కారణంగా ఇంగ్లండ్ ఆటగాళ్లకు భారత పిచ్‌లు సుపరిచితమే. మేటి స్పిన్నర్లు కూడా ఆ జట్టులో ఉన్నారు. ద్వైపాక్షిక సిరీస్‌ల్లో భారత్ చేతిలో ఓడినా.. ఐసీసీ టోర్నీల్లో ఇంగ్లండ్ సత్తా చాటుతుంది. ఆసీస్ తర్వాత భారత్‌కు ధీటుగా పోటీనిచ్చే జట్టు ఇంగ్లండ్.
గత టీ20 ప్రపంచకప్ 2024 రన్నరప్ అయిన సౌతాఫ్రికాతో కూడా భారత్‌కు ముప్పు పొంచి ఉంది. ఏ మాత్రం ఎమరపాటుగా ఉన్న సౌతాఫ్రికా భారత్‌ను ఓడించగలదు. మార్క్‌రమ్ మామ సారథ్యంలో సఫారీ టీమ్ భీకరంగా ఉంది. డికాక్, మిల్లర్, స్టబ్స్, బ్రెవిస్ వంటి విధ్వంసకర బ్యాటర్లతో పాటు జాన్సెన్, బాష్ వంటి మేటి ఆల్‌రౌండర్లు ఆ జట్టులో ఉన్నారు.
నిప్పులు చెరిగే రబడా, అన్రిచ్ నోర్జ్, ఎంగిడి ఉండగా.. కేశవ్ మహరాజ్ రూపంలో అనుభవం కలిగిన స్పిన్నర్ ఉన్నాడు. ఐపీఎల్ కారణంగా చాలా మంది ఆటగాళ్లకు భారత పిచ్‌లపై అవగాహన ఉంది. అంతేకాకుండా సౌతాఫ్రికా 20 లీగ్‌తో సఫారీ ఆటగాళ్లకు మంచి ప్రాక్టీస్ లభించింది. మెగా టోర్నీలో భారత్‌కు గట్టి పోటినిచ్చే జట్లలో సౌతాఫ్రికా ఒకటి.