ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియా.. అసలు సిసలు పోరుకు సిద్దమైంది. సూపర్-8లో భాగంగా ఆదివారం సౌతాఫ్రికాతో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో తమ కంటే భారత్‌పైనే ఒత్తిడి ఎక్కువగా ఉందని సౌతాఫ్రికా హెడ్ కోచ్ షుక్రి కాన్రాడ్ అన్నాడు.
ఈ మ్యాచ్ నేపథ్యంలో శనివారం మీడియాతో మాట్లాడిన షుక్రి కాన్రాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న భారత్ మీదే ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని చెప్పాడు. ఒత్తిడిలో ఏ జట్టు అయినా బలహీనపడుతుందని, దాన్ని క్యాష్ చేసుకొని విజయం సాధిస్తామని పేర్కొన్నాడు.
'భారత్ మీదే ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. సెమీఫైనల్స్ చేరుకునే విషయంలో టీమిండియాపైనే అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. వారు ఫైనల్‌కు కూడా చేరుకుంటారు. అయితే ఒత్తిడిలో వారు బలహీనపడుతారు. దాన్ని క్యాష్ చేసుకుంటాం. నిజానికి మా ఇరు జట్ల మీదా ఒత్తిడి ఉంటుంది.

మేమంతా అత్యుత్తమ జట్టుతో మ్యాచ్ ఆడితే ఉండే ఒత్తిడి గురించి మాట్లాడుతున్నాం. నిజానికి వారు ఏ ఒత్తిడిలో ఉన్నారో తెలియదు. అభిషేక్ శర్మ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో వరుసగా డకౌట్ అయిన వ్యక్తి, జట్టులో తన స్థానం గురించి పడే ఒత్తిడి గురించి నేను మాట్లాడటం లేదు.'అని షుక్రి కాన్రాడ్ పేర్కొన్నాడు.
మూడు మ్యాచ్‌ల్లో డకౌట్ అయినా అభిషేక్ శర్మకు టీమిండియా మేనేజ్‌మెంట్ అండగా నిలుస్తోంది. అతను వరల్డ్ నెంబర్ వన్ బ్యాటర్ అని, కీలక సమయంలో తప్పకుండా ఫామ్ అందుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. గతేడాది చివర్లో సౌతాఫ్రికా జట్టు భారత్‌లో పర్యటించింది. ఈ సందర్భంగా ఐదు టీ20ల సిరీస్‌ను టీమిండియా 3-1తో గెలిచింది.
ఈ సిరీస్‌లో ఒక మ్యాచ్ వర్షం కారణంగా తుడిచి పెట్టుకుపోయింది. అయితే ద్వైపాక్షిక సిరీస్ ఫలితాలు ప్రపంచకప్ పోరుకు ఏ మాత్రం ప్రామాణికం కావని షుక్రి అన్నాడు. ఈ క్రమంలోనే భారత్, సౌతాఫ్రికా మధ్య జరిగే సూపర్-8 పోరు హోరా హోరీగా ఉంటుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేశవ్ మహారాజ్, జార్జ్ లిండేతో సౌతాఫ్రికా స్పిన్ విభాగం, క్వింటన్ డికాక్, ర్యాన్ రికెల్టన్, ఐడెన్ మార్క్‌రమ్, ట్రిస్టన్ స్టబ్స్ బ్యాటింగ్ దళం బలంగానే కనిపిస్తోంది.