ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో సౌతాఫ్రికా సంచలన విజయాన్ని అందుకుంది. ఉత్కంఠకే ఊపిరి అందని మ్యాచ్‌లో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. గ్రూప్-డీలో భాగంగా అహ్మదాబాద్ వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన తమ రెండో లీగ్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా డబుల్ సూపర్ ఓవర్‌లో గెలుపొందింది. పొట్టి ప్రపంచకప్ చరిత్రలోనే ఈ ఫీట్ సాధించిన తొలి జట్టుగా సఫారీ టీమ్ చరిత్రకెక్కింది. ఆసాంతం ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల స్కోర్లు టై కాగా.. సూపర్ ఓవర్ ద్వారా ఫలితాన్ని తేల్చాల్సి వచ్చింది. సూపర్ ఓవర్‌లో కూడా స్కోర్లు టై కావడంతో డబుల్ సూపర్ ఓవర్ ఆడించాల్సి వచ్చింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 187 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్(41 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 59), ర్యాన్ రికెల్టన్(28 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 61) హాఫ్ సెంచరీలతో రాణించారు. అఫ్గాన్ బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్(3/41) మూడు వికెట్లు తీయగా.. రషీద్ ఖాన్(2/28) రెండు వికెట్లు పడగొట్టాడు. ఫజలక్ ఫరూఖీ ఒక వికెట్ తీసాడు.

అనంతరం అఫ్గానిస్థాన్ 19.4 ఓవర్లలో సరిగ్గా 187 పరుగులకే ఆలౌటైంది. రెహ్మానుల్లా గుర్బాజ్(42 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లతో 84) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. ఆఖరి ఓవర్‌లో అఫ్గానిస్థాన్ విజయానికి 13 పరుగులు అవసరం కాగా.. రబడా వరుసగా నోబాల్, వైడ్ వేసాడు. రెండో బంతిని నూర్ అహ్మద్ సిక్సర్ తరలించగా.. నాలుగో బంతిని మరో నోబాల్ వేసాడు. ఈ బంతికి మూడు పరుగులు వచ్చాయి. దాంతో చివరి రెండు బంతుల్లో 2 పరుగులు అవసరం కాగా.. నాలుగో బంతికి సింగిల్ తీసిన అనంతరం డబుల్ తీసే ప్రయత్నంలో ఫజలక్ ఫరూఖి రనౌటయ్యాడు. దాంతో స్కోర్లు సమమయ్యాయి.
లుంగి ఎంగిడి వేసిన తొలి సూపర్ ఓవర్‌లో అఫ్గాన్ 17 పరుగులు చేయగా.. సౌతాఫ్రికా కూడా సరిగ్గా 17 పరుగులే చేసింది. ఫజలక్ ఫరూఖి వేసిన ఈ ఓవర్‌లో బ్రేవిస్ సిక్స్ బాది ఔటవ్వగా.. స్టబ్స్ ఫోర్‌తో పాటు ఆఖరి బంతికి సిక్స్ బాది స్కోర్లు సమం చేశాడు.
రెండో సూపర్ ఓవర్‌లో అజ్మతుల్లా బౌలింగ్‌లో స్టబ్స్ ఒక సిక్స్, మిల్లర్ రెండు సిక్స్‌లతో సౌతాఫ్రికా 23 పరుగులు చేసింది. అఫ్గానిస్తాన్ మాత్రం 19 పరుగులే చేసి ఓటమిపాలైంది. కేశవ్ మహరాజ్ వేసిన ఈ ఓవర్‌లో గుర్బాజ్ వరుసగా మూడు సిక్స్‌లు బాదినా ఫలితం లేకపోయింది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే డబుల్ సూపర్ ఓవర్ ద్వారా విజయం సాధించిన తొలి జట్టుగా సౌతాఫ్రికా చరిత్రకెక్కింది.