ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా శనివారం కొలంబో వేదికగా జరగాల్సిన పాకిస్థాన్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ భారీ వర్షం కారణంగా రద్దయింది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగా.. సరిగ్గా ఇన్నింగ్స్ ప్రారంభమయ్యే సమయానికే వర్షం ఆటంకం కలిగించింది. ఎడతెరిపి లేకుండా వర్షం కురువడంతో కనీసం ఐదు ఓవర్ల ఆట కూడా సాధ్యం కాలేదు. దాంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేసి ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు.
ఇది పాకిస్థాన్, న్యూజిలాండ్ సెమీస్ అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ ఇరు జట్లు సెమీస్ చేరాలంటే తమ తదుపరి రెండు మ్యాచ్‌లకు రెండు గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తమ తదుపరి మ్యాచ్‌ల్లో ఇరు జట్లు శ్రీలంక, ఇంగ్లండ్ వంటి పటిష్టమైన జట్లతో ఆడాల్సి ఉంది.
పాకిస్థాన్, న్యూజిలాండ్ సెమీస్ చేరాలంటే తమ తదుపరి రెండు మ్యాచ్‌ల్లో కచ్చితంగా గెలవాలి. ఇంగ్లండ్, శ్రీలంకను ఓడిస్తే ఇరు జట్ల ఖాతాలో ఐదు పాయింట్స్ చేరుతాయి.ఇదే జరిగితే పాకిస్థాన్, న్యూజిలాండ్ రెండు జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. ఎందుకంటే ఇంగ్లండ్, శ్రీలంక రెండేసి మ్యాచ్‌లు ఓడిపోయి ఉంటాయి కాబట్టి.. పాకిస్థాన్, న్యూజిలాండ్ ఎలాంటి రన్ రేట్ సమీకరణాలతో సంబంధం లేకుండా సెమీస్ చేరుతాయి. అయితే రన్ రేట్ ప్రకారం గ్రూప్ టాపర్ తేలుతోంది.

ఇరు జట్లు తమ తదుపరి రెండు మ్యాచ్‌ల్లో ఒకటి గెలిచి, మరొకటి ఓడితే.. ఇరు జట్ల ఖాతాలో మూడు పాయింట్స్ ఉంటాయి. అప్పుడు ఇతర జట్ల (ఇంగ్లండ్, శ్రీలంక) ఫలితాలు, నెట్‌రన్‌రేట్‌పై ఆధారపడి ఉంటుంది. రెండు మ్యాచ్‌లకు రెండి ఓడితే ఇరు జట్లు టోర్నీ నుంచి నిష్క్రమిస్తాయి.
శ్రీలంకలో ప్రస్తుతం భారీ వర్షాలు పడుతున్నాయి. పాకిస్థాన్, న్యూజిలాండ్ ఆడే తమ తదుపరి మ్యాచ్‌లకు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. ఒకవేళ ఇంగ్లండ్ లేదా శ్రీలంకతో జరగబోయే తదుపరి మ్యాచ్‌ల్లో ఏదైనా వర్షం వల్ల రద్దయితే.. పాక్, న్యూజిలాండ్ కేవలం ఒక విజయం సాధించినా 3 పాయింట్లకే పరిమితమవుతాయి. అప్పుడు సెమీస్ రేసు చాలా సంక్లిష్టంగా మారుతుంది.
గ్రూప్-2లో ఇంగ్లండ్, శ్రీలంక, న్యూజిలాండ్, పాకిస్థాన్ వంటి బలమైన జట్లు ఉన్నాయి. ఒకవేళ పాయింట్లు సమమైతే, సెమీస్ బెర్తును నెట్ రన్ రేట్ నిర్ణయిస్తుంది. కాబట్టి పాకిస్థాన్, న్యూజిలాండ్ తమ తదుపరి మ్యాచ్‌లను భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. అయితే వర్షంతో రద్దయిన మ్యాచ్‌లకు నెట్ రన్‌రేట్ లెక్కించరు. ఇది న్యూజిలాండ్, పాకిస్థాన్‌కు ప్రతికూలం కానుంది.