ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో స్కాట్లాండ్ తొలి విజయాన్ని నమోదు చేసింది. గ్రూప్-సీలో భాగంగా పసికూన ఇటలీతో సోమవారం కోల్‌కతా జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్ 73 పరుగుల తేడాతో గెలుపొందింది. స్కాట్లాండ్ ఆల్‌రౌండర్ మైఖేల్ లీస్క్(5 బంతుల్లో 22 నాటౌట్, 4/17) సంచలన ప్రదర్శనతో తమ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 207 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆ జట్టు ఓపెనర్ జార్జ్ మున్సే(54 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌లతో 84) తృటిలో శతకం చేజార్చుకోగా.. బ్రాండన్ మెక్‌ముల్లెన్(18 బంతుల్లో 4 సిక్స్‌లతో 41), మైఖేల్ లీస్క్(5 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 22 నాటౌట్) మెరుపులు మెరిపించారు. ఇటలీ బౌలర్లలో అలీ హసన్, గ్రాంట్ స్టేవర్ట్, జేజే స్మట్స్ తలో వికెట్ తీసారు.

అనంతరం ఇటలీ 16.4 ఓవర్లలో 134 పరుగులకు ఆలౌటైంది. బెన్ మానెంటీ(31 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 52) హాఫ్ సెంచరీతో రాణించగా.. హ్యారీ మనేంటి(25 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 37) పర్వాలేదనిపించాడు. స్కాట్లాండ్ బౌలర్లలో మైఖేల్ లీస్క్(4/17) నాలుగు వికెట్లు తీయగా.. మార్క్ వాట్(2/24) రెండు వికెట్లు పడగొట్టాడు. బ్రాడ్ కర్రీ, ఒలివర్ డేవిడ్సన్, బ్రాడ్ వీల్ తలో వికెట్ తీసారు. వెస్టిండీస్‌తో తొలి మ్యాచ్‌లో ఓడిన స్కాట్లాండ్.. ఇటలీపై సమష్టి ప్రదర్శనతో విజయం సాధించింది. రెండు మ్యాచ్‌ల్లో ఒక విజయంతో గ్రూప్-సీలో రెండో స్థానంలో కొనసాగుతోంది.
తొలి సారి టీ20 ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధించిన ఇటలీ క్రికెట్ జట్టుకు తమ అరంగేట్ర మ్యాచ్‌లోనే కోలుకోలేని దెబ్బ తగిలింది. కోల్‌కతాలోని ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్ మైదానంలో స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇటలీ కెప్టెన్ వేన్ మాడ్సెన్ తీవ్రంగా గాయపడ్డాడు.
స్కాట్లాండ్ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లో ఓపెనర్ జార్జ్ మున్సే కొట్టిన షాట్‌ను మిడ్ వికెట్‌లో ఫీల్డింగ్ చేస్తున్న మాడ్సెన్ స్టన్నింగ్ డైవ్‌తో అడ్డుకునే ప్రయత్నం చేశాడు. అయితే అతని ఎడమ భుజం బలంగా నేలను తాకడంతో డిస్‌లొకేట్ అయ్యింది. తీవ్ర నొప్పితో మాడ్సెన్ మైదానం వీడాడు. అతను మళ్లీ ఫీల్డింగ్‌తో పాటు బ్యాటింగ్ కూడా రాలేదు.
మాడ్సెన్ గతంలో (2006లో) సౌతాఫ్రికా తరపున హాకీ ప్రపంచకప్ ఆడారు. ఇప్పుడు క్రికెట్ ప్రపంచకప్‌లో అరంగేట్రం చేస్తూ ఇలా గాయపడటం క్రికెట్ అభిమానులను కలచివేస్తోంది.