ఫహీమ్ అష్రఫ్‌కు బ్యాటింగ్ చేసే సామర్థ్యం ఉండటంతోనే షాహిన్ అఫ్రిదిని పక్కన పెట్టామని పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అఘా తెలిపాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న సూపర్-8 మ్యాచ్‌లో పాకిస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని సల్మాన్ అఘా పేర్కొన్నాడు.
'మేం ముందుగా బ్యాటింగ్ చేస్తాం. తుది జట్టులో ఒక మార్పు చేశాం. ఫఖర్ జమాన్ ఆడుతుండగా.. నఫీ ఆడటం లేదు. మా వద్ద ఒక పేసర్ ఫహీమ్ అష్రఫ్ ఉన్నాడు. అతను మంచి ఆల్ రౌండర్. కాబట్టి మా వద్ద ఇద్దరు పేసర్లు, కావాల్సిన స్పిన్ ఆప్షన్లు ఉన్నాయి. న్యూజిలాండ్ క్వాలిటీ టీమ్ అని మాకు తెలుసు. మేం మా అత్యుత్తమ ఆటను ప్రదర్శించాలి. ఈరోజు దాని కోసమే ఎదురుచూస్తున్నాం.'అని సల్మాన్ అఘా చెప్పుకొచ్చాడు.

మరోవైపు న్యూజిలాండ్ జట్టులో మూడు మార్పులు చోటు చేసుకున్నాయి. ఇష్ సోదీ, లోకీ ఫెర్గూసన్ తుది జట్టులోకి రీఎంట్రీ ఇచ్చారని న్యూజిలాండ్ టీ20 కెప్టెన్ మిచెల్ సాంట్నర్ తెలిపాడు. పాకిస్థాన్ జట్టులో మంచి స్పిన్నర్లు ఉన్నారని, ఈ మ్యాచ్ అద్భుతంగా ఉండబోతుందని చెప్పాడు. ' మేం మూడు మార్పులు చేశాం. ఇష్ సోధి, లోకీ ఫెర్గూసన్ జట్టులోకి తిరిగి వచ్చారు. ఈ మ్యాచ్ వినోదాత్మకంగా ఉండబోతోంది. వారి జట్టులో మంచి స్పిన్నర్లు ఉన్నారు.'అని సాంట్నర్ చెప్పుకొచ్చాడు.
న్యూజిలాండ్: టిమ్ సీఫెర్ట్ (కీపర్), ఫిన్ అలెన్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), జేమ్స్ నీషమ్, మాట్ హెన్రీ, ఇష్ సోధి, లోకీ ఫెర్గూసన్
పాకిస్థాన్: సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, సల్మాన్ ఆఘా (కెప్టెన్), బాబర్ ఆజం, ఫఖర్ జమాన్, ఉస్మాన్ ఖాన్ (కీపర్), షాదాబ్ ఖాన్, మహమ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, సల్మాన్ మీర్జా, ఉస్మాన్ తారిఖ్.