ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య ప్రారంభం కావాల్సిన మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారింది. కొలంబోలోని ప్రేమదాసు స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో సరిగ్గా పాకిస్థాన్ బ్యాటింగ్ ప్రారంభానికి ముందు వర్షం అంతరాయం కలిగించింది. దాంతో ఇరు జట్ల ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌కు పరిమితం కాగా.. మైదాన సిబ్బంది గ్రౌండ్‌ను కవర్లతో కప్పి వేసారు. వర్షం వస్తూ ఆగుతూ దోబుచులాడుతూ ఉంది.
వర్షం వస్తూ పోతూ ఉండటంతో మైదానాన్ని సిద్దం చేయడం గ్రౌండ్స్‌మెన్‌కు కష్టంగా మారింది. అంతకుముందు ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అఘా పేర్కొన్నాడు. తుది జట్టులో ఒక మార్పు జరిగిందని వివరించాడు. ఒక స్పెషలిస్ట్ పేసర్‌తో పాటు మరో పేస్ ఆల్‌రౌండర్ కాంబినేషన్‌తో బరిలోకి దిగుతున్నట్లు చెప్పాడు.
మరోవైపు న్యూజిలాండ్ తమ తుది జట్టులో మూడు మార్పులు చేసింది. ఇష్ సోదీ, లోకీ ఫెర్గూసన్ తుది జట్టులోకి రీఎంట్రీ ఇచ్చారని న్యూజిలాండ్ టీ20 కెప్టెన్ మిచెల్ సాంట్నర్ తెలిపాడు. పాకిస్థాన్ జట్టులో మంచి స్పిన్నర్లు ఉన్నారని, ఈ మ్యాచ్ అద్భుతంగా ఉండబోతుందని టాస్ సందర్భంగా వెల్లడించాడు.

రాత్రి 8.10 గంటల లోపు ఈ మ్యాచ్ ప్రారంభమైతే పూర్తి మ్యాచ్ నిర్వహిస్తారు. లేదంటే ఓవర్లలో కోత విధించి ఆడిస్తారు. ఈ ఈ మ్యాచ్ కటాఫ్ టైమ్ రాత్రి 10:16 గంటలు. ఆ లోపు మ్యాచ్ ప్రారంభం కావాలి. ఇరు జట్లు కనీసం 5 ఓవర్లు ఆడే పరిస్థితి ఉంటేనే మ్యాచ్ కొనసాగిస్తారు. వాస్తవానికి ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 మ్యాచ్ ఫలితాల కోసం ఐసీసీ 90 నిమిషాల సమయాన్ని అదనంగా కేటాయించింది. దాంతో ఈ మ్యాచ్ కటాఫ్ టైమ్ రాత్రి 10:16 గంటలకు చేరింది. లేదంటే రాత్రి 8.46 నిమిషాల తుది నిర్ణయాన్ని వెల్లడించేవారు.
కనీసం ఐదు ఓవర్ల ఆట సాధ్యం కాకపోతే మ్యాచ్‌ను రద్దు చేసి ఇర జట్లకు చెరో పాయింట్ కేటాయిస్తారు. ఎందుకంటే సూపర్-8 మ్యాచ్‌లకు ఐసీసీ రిజర్వ్ డే కేటాయించలేదు. ఈ మ్యాచ్ రద్దయితే న్యూజిలాండ్, పాకిస్థాన్ జట్ల సెమీస్ అవకాశాలపై ప్రభావం పడుతుంది. రద్దయిన మ్యాచ్‌లకు నెట్ రన్ రేట్‌ను లెక్కించరు.
ఈ గ్రూప్‌లో ఇంగ్లండ్, శ్రీలంక వంటి బలమైన జట్లు ఉన్నాయి. పాయింట్లు పంచుకోవడం వల్ల రెండు జట్లూ తమ తదుపరి రెండు మ్యాచ్‌ల్లో ఖచ్చితంగా గెలవాల్సిన ఒత్తిడి పడుతుంది. ముఖ్యంగా న్యూజిలాండ్ తన తదుపరి మ్యాచ్‌లను పల్లెకెలెలో ఆడనుంది, అక్కడ కూడా వర్ష సూచన ఉంటే వారి సెమీస్ అవకాశాలు ప్రమాదంలో పడే అవకాశం ఉంది.
న్యూజిలాండ్: టిమ్ సీఫెర్ట్ (కీపర్), ఫిన్ అలెన్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), జేమ్స్ నీషమ్, మాట్ హెన్రీ, ఇష్ సోధి, లోకీ ఫెర్గూసన్
పాకిస్థాన్: సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, సల్మాన్ ఆఘా (కెప్టెన్), బాబర్ ఆజం, ఫఖర్ జమాన్, ఉస్మాన్ ఖాన్ (కీపర్), షాదాబ్ ఖాన్, మహమ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, సల్మాన్ మీర్జా, ఉస్మాన్ తారిఖ్.