Pavan Rathnayake: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో శ్రీలంక జోరు కొనసాగుతోంది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విజయం సాధించింది. గ్రూప్-బీలో భాగంగా పల్లెకెలె వేదికగా గురువారం జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 105 పరుగుల తేడాతో ఒమన్‌ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక పూర్తి ఆధిపత్యం చెలాయించగా.. ఒమన్ తేలిపోయింది. కనీస పోటీనివ్వలేకపోయింది. ఈ విజయంతో గ్రూప్-బీ నుంచి సూపర్ -8 అవకాశాలను మెరుగుపర్చుకోగా.. ఒమన్ ఇంటిబాట పట్టేందుకు సిద్దమైంది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 225 పరుగులు చేసింది. కుశాల్ మెండీస్(45 బంతుల్లో 7 ఫోర్లతో 61), పవన్ రత్నాయక(28 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 60), డసన్ షనక(20 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 50) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఒమన్ బౌలర్లలో జితెన్ రమణంది(2/41) రెండు వికెట్లు తీయగా.. జయ్ ఒడెడ్రా, సుఫ్యాన్ మెహ్‌మూద్ చెరో వికెట్ తీసారు.

అనంతరం ఒమన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 120 పరుగులు చేయగలిగింది. మహమ్మద్ నదీమ్(56 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 53 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. శ్రీలంక బౌలర్లలో దుష్మంత్ చమీరా(2/19), మహీష్ తీక్షణ(2/11) రెండేసి వికెట్లు తీయగా.. దునిత్ వెల్లలేగే, దుషన్ హేమంత, కామిందు మెండీస్ తలో వికెట్ తీసారు.
ఈ గెలుపుతో శ్రీలంక గ్రూప్-బీలో టాపర్‌గా కొనసాగుతోంది. ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉండగా... జింబాబ్వే మూడో స్థానంలో ఉంది. రెండు మ్యాచ్‌లకు రెండు ఓడిన ఐర్లాండ్, ఒమన్ సూపర్-8 రేసు నుంచి తప్పుకుంది.