PAK vs SL: కొంపముంచిన తారిక్.. ఇంటి బాట పట్టిన పాక్
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో పాకిస్థాన్ పోరాటం ముగిసింది. శనివారం పల్లెకెలె వేదికగా జరిగిన తమ ఆఖరి సూపర్-8 పోరులో శ్రీలంకను 147 పరుగులకు కట్టడి చేయడంలో పాకిస్థాన్ విఫలమైంది. దాంతో ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ 5 పరుగుల తేడాతో గెలిచినా టోర్నీ నుంచి నిష్క్రమించింది. గ్రూప్-2 నుంచి న్యూజిలాండ్ సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది. న్యూజిలాండ్ రన్‌రేట్ మెరుగ్గా ఉండటంతో టోర్నీలో ముందడుగు వేసింది.
శ్రీలంక పోతూ పోతూ తమ వెంట పాకిస్థాన్‌ను కూడా తీసుకుపోయింది. గ్రూప్-2 నుంచి హ్యాట్రిక్ విజయాలతో ఇంగ్లండ్ ఇప్పటికే సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకున్న సంగతి తెలిసిందే.
సెమీస్ చేరాలంటే తప్పక గెలవడంతో పాటు రన్‌రేట్ మెరుగుపర్చుకోవాల్సిన మ్యాచ్‌లో పాకిస్థాన్ బ్యాటింగ్‌లో దుమ్మురేపింది. ఓపెనర్లు షాహిబ్జాదా ఫర్హాన్(60 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్‌లతో 100), ఫకార్ జమాన్(42 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో 84) అసాధారణ బ్యాటింగ్‌తో ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 212 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ ఇద్దరూ తొలి వికెట్‌కు 176 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించారు. తర్వాత వచ్చిన బ్యాటర్లు విఫలమవడంతో 230 ప్లస్ స్కోర్ చేసే అవకాశాన్ని కోల్పోయింది.

బౌలింగ్‌లోనూ పాకిస్థాన్ అద్భుతమైన ఆరంభాన్ని అందుకుంది. నసీమ్ షా, అబ్రార్ అహ్మద్(3/23), మహమ్మద్ నవాజ్ నిప్పులు చెరగడంతో శ్రీలంక 101 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. మరో 46 పరుగుల వ్యవధిలోనే ఐదు వికెట్లు తీసేలా కనిపించింది. కానీ శ్రీలంక బ్యాటర్లలో పవన్ రత్నాయకే(37 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 58), డసన్ షనక అద్భుతమైన బ్యాటింగ్‌తో పాకిస్థాన్ సెమీస్ అవకాశాలను దెబ్బతీసారు. పాకిస్థాన్ ప్రధాన స్పిన్నర్ ఉస్మాన్ తారిక్(0/43) తీవ్రంగా నిరాశపర్చాడు. అతని వైఫల్యం పాకిస్థాన్ కొంపముంచింది.
మరోవైపు ఘోర పరాజయం దిశగా సాగిన శ్రీలంక.. డసన్ షనక (31 బంతుల్లో 2 ఫోర్లు, 8 సిక్స్‌లతో 76 నాటౌట్) అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శనతో అనూహ్యంగా పుంజుకొని పాకిస్థాన్‌ను ఓడించినంత పనిచేసింది. కానీ నిర్ణీత 20 ఓవర్లలో 207/6 స్కోర్‌కే పరిమితమై 5 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక ఓడినా అభిమానుల మనసులను గెలుచుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications