ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో పాకిస్థాన్ కీలక పోరుకు సిద్దమైంది. గ్రూప్-ఏలో భాగంగా కొలంబో వేదికగా బుధవారం నమీబియాతో పాకిస్థాన్ అమీతుమీ తేల్చుకోనుంది. సూపర్-8 చేరాలంటే ఈ మ్యాచ్ గెలవడం పాకిస్థాన్ కీలకం. ఓడితే మాత్రం టోర్నీ నుంచి నిష్క్రమించనుంది. దాంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఈ టోర్నీలో వరుసగా రెండు విజయాలు సాధించిన పాకిస్థాన్‌కు టీమిండియా దిమ్మతిరిగే షాకిచ్చింది. గత ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం చెలాయించిన భారత్ 61 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ గెలుపుతో గ్రూప్-ఏ నుంచి సూపర్-8 బెర్త్ ఖరారు చేసుకున్న భారత్.. పాకిస్థాన్‌పై తమ ఆధిపత్యాన్ని 8-1గా మార్చుకుంది.
ఈ ఘోర పరాజయం నేపథ్యంలో పాకిస్థాన్ జట్టుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తమ మాజీ ఆటగాళ్లే సల్మాన్ అఘా సారథ్యంలోని పాకిస్థాన్ జట్టుపై దుమ్మెత్తిపోస్తున్నారు. పీసీబీ ఛైర్మన్ మోహ్‌సిన్ నఖ్వీని ఘాటుగా విమర్శించారు. పాకిస్థాన్ ఓటమికి జట్టులోని సీనియర్ ఆటగాళ్లు అయిన బాబర్ ఆజామ్, షాహిన్ అఫ్రిది, మహమ్మద్ నవాజ్ కారణమని మండిపడ్డారు.
భారత్ చేతిలో ఓటమిని సీరియస్‌గా తీసుకున్న పీసీబీ అర్ధరాత్రే కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. జట్టు ఓటమికి కారణమైన షాహిన్ అఫ్రిది, బాబర్ ఆజామ్‌పై వేటు వేసేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. నమీబియాతో మ్యాచ్‌కు ఈ ఇద్దర్నీ పక్కనపెట్టి వారి స్థానాల్లో సల్మాన్ మీర్జా, నసీమ్, ఫకర్, ఖవాజా పేర్లను పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

ప్రస్తుతం శ్రీలంకలో వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం జింబాబ్వే, ఐర్లాండ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షంతో తుడిచిపెట్టుకుపోయింది. పాకిస్థాన్, నమీబియా మ్యాచ్ రద్దయితే సల్మాన్ అఘా జట్టుకు కలిసి రానుంది. వర్షంతో రద్దయితే ఒక పాయింట్ పాకిస్థాన్ ఖాతాలో చేరనుంది. అప్పుడు 5 పాయింట్స్‌తో పాకిస్థాన్ సూపర్-8 చేరనుంది.
నమీబియాను తేలికగా తీసుకోవడానికి లేదు. భారత్‌తో జరిగిన జట్టులో నమీబియా అద్భుతంగా బౌలింగ్ చేసింది. భారత్ భారీ స్కోర్‌ను అడ్డుకుంది. మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ యాదవ్ కూడా నమీబియా బౌలింగ్‌ను ప్రశంసించాడు. ఈ క్రమంలోనే నమీబియా సంచలన ప్రదర్శన కనబర్చి పాకిస్థాన్ ఓడిస్తే.. అమెరికా సూపర్-8 చేరుతుంది. ప్రస్తుతం అమెరికా మెరుగైన రన్‌రేట్‌తో రెండో స్థానంలో కొనసాగుతోంది. నమీబియాపైనే ఆ జట్టు ఆశలు పెట్టుకుంది.
షాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, సల్మాన్ అలీ అఘా(కెప్టెన్), బాబర్ ఆజామ్/ఫకార్ జమాన్, ఉస్మాన్ ఖాన్, షాదాబ్ ఖాన్, మహమ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ షా అఫ్రిది/నసీమ్ షా, అబ్రర్ అహ్మద్, ఉస్మాన్ తారిక్.