T20 World Cup 2026: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 నేపథ్యంలో పాకిస్థాన్ రూపొందించిన నయా జెర్సీపై వివాదం రేగింది. ఈ జెర్సీపై ఐఎస్ఐ లోగో ఉందని నెటిజన్లు మండిపడుతున్నారు. ఆకు పచ్చ రంగు పాక్ జెర్సీపై అటవీ మేక 'మార్ఖోర్' చిహ్నం ఉంది. ఈ జెర్సీ మధ్యలో నల్లటి రంగులో మార్ఖోర్ చిత్రాన్ని ముద్రించారు. అయితే పాకిస్థాన్ జాతీయ జంతువు మార్ఖోర్. ఈ ఉద్దేశంతో పీసీబీ జెర్సీపై మార్ఖోర్ ప్రింట్ వేసింది.
అయితే ఇదే చిహ్నాన్ని పాకిస్థాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ కూడా ఉపయోగిస్తోంది. ఈ నేపథ్యంలోనే జెర్సీపై మార్ఖోర్ బొమ్మ కనిపించడాన్ని నెటిజన్లు తప్పుబడుతున్నారు. మెగా టోర్నీలో ఇలాంటి జెర్సీలను ఎలా అనుమతిస్తారు? అని ఐసీసీని నిలదీస్తున్నారు.
హిమాలయాలు, కారకోరంలోని ఎత్తైన పర్వత ప్రాంతాల్లో ఈ అటవీ మేక (మార్ఖోర్) ఎక్కువగా కనిపిస్తోంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద అటవీ మేకగా గుర్తింపు పొందింది. జమ్మూకశ్మీర్, అఫ్గానిస్థాన్‌లోనూ కొన్నిచోట్ల ఈ మేక కనిపిస్తుంది. ఈ మేకను పాకిస్థాన్ తమ జాతీయ జంతువుగా ప్రకటించింది.

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 కోసం పాకిస్థాన్ జట్టు శ్రీలంకకు చేరుకుంది. సోమవారం శ్రీలంక రాజధాని కొలంబోలో అడుగుపెట్టింది. భారత్‌తో మ్యాచ్‌ను బాయ్‌కట్ చేస్తున్నామని పాకిస్థాన్ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఆ జట్టు రాక ప్రాధాన్యతను సంతరించుకుంది. సల్మాన్ అలీ అఘా సారథ్యంలోని పాకిస్థాన్ జట్టు మంగళవారం విశ్రాంతి తీసుకొని బుధవారం సిహళీస్ స్పోర్ట్స్ క్లబ్‌లో ఐర్లాండ్‌తో తమ ఏకైక వామప్ మ్యాచ్ ఆడనుంది.
పాకిస్థాన్ జట్టు భారత్, అమెరికా, నెదర్లాండ్స్, నమీబియాతో గ్రూప్-ఏలో ఉంది. ఫిబ్రవరి 7న నెదర్లాండ్స్‌తో తొలి మ్యాచ్ ఆడనున్న పాకిస్థాన్.. ఫిబ్రవరి 10న అమెరికాతో, ఫిబ్రవరి 15న భారత్, ఫిబ్రవరి 18న నమీబియాతో ఆడనుంది. అయితే భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను తాము బహిష్కరిస్తున్నామని పాకిస్థాన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
ఈ క్రమంలోనే పీసీబీతో ఐసీసీ సంప్రదింపులు ప్రారంభించింది. తమ మాట వినకపోతే టోర్నీ నుంచి పూర్తి నిషేధం విధిస్తారనే ప్రచారం కూడా జరిగింది. కానీ పాకిస్థాన్ టీమ్ శ్రీలంకలో అడుగుపెట్టడంతో ఐసీసీ తీసుకోబోయే చర్యలపై ఉత్కంఠ నెలకొంది. భారత్, పాకిస్థాన్ మ్యాచ్ జరుగుతుందా? లేదా? అనేది కూడా చర్చనీయాంశమైంది.