ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో కీలకమైన సూపర్-8 దశ ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ నెట్స్‌లో గాయపడ్డాడు. సూపర్-8 దశలో సౌతాఫ్రికాతో మ్యాచ్ నేపథ్యంలో శుక్రవారం ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్న సిరాజ్.. బౌలింగ్ చేస్తుండగా గాయపడ్డాడు. అతను వేసిన బంతిని హార్దిక్ పాండ్యా బలంగా కొట్టాడు. అది కాస్త సిరాజ్ ఎడమ మోకాలికి బలంగా తగిలింది. దాంతో అతను నొప్పితో విలవిల్లాడిపోయాడు.
ఫిజియో అతనికి సపర్యలు చేశాడు. కాసేపటికి నెట్స్ నుంచి సిరాజ్ వెళ్లిపోయాడు. దాంతో సిరాజ్ గాయంపై ఆందోళన నెలకొంది.ఈ మెగా టోర్నీలో మహమ్మద్ సిరాజ్ ఒకే ఒక్క మ్యాచ్ ఆడిన సంగతి తెలిసిందే. మెగా టోర్నీ ప్రారంభానికి ముందు సౌతాఫ్రికాతో వార్మప్ మ్యాచ్‌లో హర్షిత్ రాణా గాయపడటంతో అనూహ్యంగా సిరాజ్ జట్టులోకి వచ్చాడు. అమెరికాతో మ్యాచ్‌కు జస్‌ప్రీత్ బుమ్రా అనారోగ్యంతో దూరమవడంతో తుది జట్టులోకి వచ్చాడు. ఈ మ్యాచ్‌లో సిరాజ్ మూడు వికెట్లతో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత బుమ్రా రీఎంట్రీ ఇవ్వడంతో సిరాజ్ బెంచ్‌కే పరిమితమయ్యాడు.

సూపర్-8 దశకు ముందు అతను గాయపడటంతో భారత అభిమానుల్లో ఆందోళన నెలకొంది. బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్‌కు బ్యాకప్‌గా కొనసాగుతున్న సిరాజ్ జట్టుకు దూరమైతే ఎవర్ని ఎంపిక చేస్తారనే చర్చ జరుగుతుంది. మరోవైపు సిరాజ్ గాయంపై బీసీసీఐ ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు. అతని గాయం చిన్నదేనని జట్టుకు దూరమయ్యే పెద్దది కాదని ప్రచారం జరుగుతోంది.
ఈ మెగా టోర్నీలో వరుసగా నాలుగు విజయాలతో టీమిండియా జోరుమీద ఉంది. అమెరికాతో మినహా మిగతా మూడు మ్యాచ్‌ల్లో ఏ పక్ష విజయాలు నమోదు చేసింది. అజేయంగా సూపర్-8 చేరిన భారత్.. అదే జోరును కొనసాగించి ఫైనల్ చేరాలనుకుంటుంది. సోమవారం అహ్మదాబాద్ వేదికగా రాత్రి 7 గంటలకు జరిగే సూపర్-8 పోరులో సౌతాఫ్రికాతో అమీతుమీ తేల్చుకోనుంది. డిసెంబర్ 26న జింబాబ్వేతో, మార్చి 1న వెస్టిండీస్‌తో తమ తదుపరి సూపర్-8 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ మూడు మ్యాచ్‌ల్లో కనీసం రెండు విజయాలు సాధిస్తేనే టీమిండియా సెమీఫైనల్ చేరనుంది.