Ishan Kishan: టీమిండియా వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ ఇషాన్ కిషన్ చరిత్ర సృష్టించాడు. టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే హాఫ్ సెంచరీ బాదిన తొలి వికెట్ కీపర్‌గా నిలిచాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నమీబియాతో గురువారం జరిగిన మ్యాచ్‌లో 20 బంతుల్లో హాఫ్ సెంచరీ చేయడం ద్వారా ఈ ఫీట్ సాధించాడు.
ఈ మ్యాచ్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిన ఇషాన్ కిషన్.. 24 బంతుల్లో 61 పరుగులు చేసి వెనుదిరిగాడు. అయితే తన రెండో ప్రపంచకప్ మ్యాచ్‌లోనే ఇషాన్ కిషన్ ఈ ఫీట్ సాధించాడు. టీమిండియా దిగ్గజ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా ఈ ఫీట్ సాధించలేదు.
2007 నుంచి 2016 మధ్య ధోనీ మొత్తం 6 టీ20 ప్రపంచకప్‌లు ఆడాడు. ఈ 9 ఏళ్లలో టీమిండియాకు అతనే సారథిగా వ్యవహరించాడు. ధోనీ సారథ్యంలోనే భారత జట్టు అరంగేట్ర టీ20 ప్రపంచకప్ గెలిచింది. 2014లో రన్నరప్‌గా నిలిచింది. టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో ధోనీ అత్యధిక స్కోర్ 45. 2007లో సౌతాఫ్రికాపై ఆ పరుగులు చేశాడు. ధోనీ ఎప్పుడూ ఫినిషర్ పాత్రలో బ్యాటింగ్ చేసేవాడు. చివర్లో వచ్చి దూకుడుగా పరుగులు చేయడం అతని పని. దాంతోనే హాఫ్ సెంచరీ ఫీట్ సాధించలేకపోయాడు.

2020 ఆగస్టులో రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ.. 2016లో వెస్టిండీస్‌తో జరిగిన సెమీఫైనల్లో తన చివరి టీ20 ప్రపంచకప్ మ్యాచ్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో భారత్‌ను ఓడించిన వెస్టిండీస్.. ఫైనల్లో ఇంగ్లండ్‌పై గెలిచి విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ధోనీ అనంతరం రిషభ్ పంత్ టీమిండియా ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్‌గా జట్టులో కొనసాగాడు. 2021, 2024 టీ20 ప్రపంచకప్‌ల్లో అతను ఆడగా.. 2022 టీ20 ప్రపంచకప్‌లో దినేశ్ కార్తీక్ బరిలోకి దిగాడు. ఈ ఇద్దరూ కూడా హాఫ్ సెంచరీలు నమోదు చేయలేకపోయారు.
అనూహ్యంగా టీ20 ప్రపంచకప్ జట్టులోకి వచ్చిన ఇషాన్ కిషన్.. తన రెండో ప్రపంచకప్ మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణించడం అతనికి బాగా కలిసొచ్చింది. సంజూ శాంసన్ వైఫల్యం కూడా ఇషాన్ కిషన్ ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్‌గా ఆడేలా చేసింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 209 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్(24 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 61), హార్దిక్ పాండ్యా(27 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 52) హాఫ్ సెంచరీలతో రాణించారు. నమీబియా కెప్టెన్ ఎరాస్మస్(4/20) నాలుగు వికెట్లు తీయగా.. బెన్ షికోంగో, జేజే స్మిత్, బెర్నార్డ్ స్కాల్ట్జ్ తలో వికెట్ తీసారు.