ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో వరుస విజయాలతో జోరు కనబర్చిన టీమిండియాకు సౌతాఫ్రికా కళ్లెం వేసింది. సూపర్-8లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన సౌతాఫ్రికా 76 పరుగుల భారీ తేడాతో టీమిండియాను చిత్తు చేసింది. సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్(3/24) మూడు వికెట్లతో భారత్ బ్యాటింగ్ పతనాన్ని శాసించగా.. బ్యాటింగ్‌లో డేవిడ్ మిల్లర్ (35 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 63) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు.
187 పరుగుల లక్ష్య ఛేధనలో టీమిండియా 18.5 ఓవర్లలో 111 పరుగులకు ఆలౌటైంది. శివమ్ దూబే(37 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 42 నాటౌట్) ఒక్కడే ఒంటరి పోరాటం చేయగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో యాన్సెన్(4/22) నాలుగు వికెట్లు, కేశవ్ మహరాజ్(3/24) మూడు వికెట్లతో టీమిండియా పతనాన్ని శాసించారు. కార్బిన్ బోష్ రెండు వికెట్లు తీయగా.. ఎయిడెన్ మార్క్‌రమ్ ఒక వికెట్ పడగొట్టాడు. పిచ్ కండిషన్స్‌ను గౌరవించకుండా అత్యుత్సాహంతో చెత్త షాట్లు ఆడిన భారత టాప్-3 బ్యాటర్లు టీమిండియా ఓటమికి కారణమయ్యారు.
అంతకుముందు సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 187 పరుగుల భారీ స్కోర్ చేసింది. డేవిడ్ మిల్లర్ (35 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 63) హాఫ్ సెంచరీతో రాణించగా.. డెవాల్డ్ బ్రెవిస్(29 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 45), ట్రిస్టన్ స్టబ్స్(24 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 44 నాటౌట్) దూకుడుగా ఆడారు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా(3/15) మూడు వికెట్లతో సత్తా చాటగా.. అర్ష్‌దీప్ సింగ్(2/28) రెండు వికెట్లు పడగొట్టాడు. వరుణ్ చక్రవర్తీ, శివమ్ దూబే చెరో వికెట్ తీసారు. హార్దిక్ పాండ్యా ఆఖరి ఓవర్‌లో 20 పరుగులివ్వడం భారత్ పతనాన్ని శాసించింది. ఈ ఒక్క ఓవర్ మ్యాచ్ మూమెంటమ్‌ను సౌతాఫ్రికా వైపు మళ్లించింది.

భారీ లక్ష్య ఛేదనలో టీమిండియా టాపార్డర్ కుప్పకూలింది. తొలి ఓవర్‌లోనే డేంజరర్ ఓపెనర్ ఇషాన్ కిషన్ డకౌటవ్వగా.. రెండో ఓవర్‌లో తిలక్ వర్మ(1) వెనుదిరిగాడు. ఎట్టకేలకు డకౌట్ల పరంపరకు చెక్ పెట్టి పరుగుల ఖాతా తెరిచిన అభిషేక్ శర్మ(15) మరోసారి చెత్త షాట్‌తో వెనుదిరిగాడు. దాంతో పవర్ ప్లేలోనే మూడు వికెట్లు కోల్పోయిన భారత్ 41 పరుగులు మాత్రమే చేసింది. ఈ పరిస్థితుల్లో సుందర్, సూర్య ఆచితూచి ఆడే ప్రయత్నం చేసినా.. సౌతాఫ్రికా బౌలర్లు అవకాశం ఇవ్వలేదు.
సుందర్(11), సూర్యకుమార్ యాదవ్(18)ను కార్బిన్ బోష్ వరుస ఓవర్లలో పెవిలియన్ చేర్చాడు. 51 పరుగులే 5 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగింది. హార్దిక్ పాండ్యా భారీ సిక్సర్‌తో ఆశలు రేకెత్తించినా.. అతనికి మహరాజ్ కళ్లెం వేసాడు. క్రీజులోకి వచ్చిన రింకూ సింగ్ గోల్డెన్ డకౌట్ కాగా.. అర్ష్‌దీప్ సింగ్ సైతం అదే ఓవర్‌లో వెనుదిరిగాడు. వరుణ్ చక్రవర్తీ సాయంతో శివమ్ దూబే జట్టు స్కోర్‌ను 100 ధాటించాడు. హాఫ్ సెంచరీ చేరువైన శివమ్ దూబేను మార్కో యాన్సెన్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చగా.. మరుసటి బంతికి జస్‌ప్రీత్ బుమ్రా గోల్డెన్ డకౌట్ చేసి సౌతాఫ్రికా విజయాన్ని లాంఛనం చేశాడు.
ఈ పరాజయంతో టీమిండియా సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. జింబాబ్వే, వెస్టిండీస్‌తో జరిగే తమ తదుపరి మ్యాచ్‌లను టీమిండియా మెరుగైన రన్‌రేట్‌తో గెలవాలి. ఈ మ్యాచ్‌ల్లో ఒక్కడి ఓడినా.. వర్షంతో రద్దయినా టీమిండియా సెమీస్ అవకాశాలు సన్నగిల్లుతాయి. ఈ మ్యాచ్ ఓటమితో.. తదుపరి రెండు మ్యాచ్‌లు గెలవాలనే అనవసర ఒత్తిడి టీమిండియాపై నెలకొంది. 76 పరుగుల భారీ తేడాతో ఓడిపోవడంతో టీమిండియా రన్ రేట్ కూడా దారుణంగా పడిపోయింది.