టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా భారత్‌తో జరిగే మ్యాచ్‌ను బహిష్కరించాలని తమ జట్టును ఆదేశించిన పాకిస్థాన్ ప్రభుత్వంపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ICC) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ చర్య ప్రపంచ క్రీడా నిమయాలకు విరుద్దమని, ఇది పాకిస్థాన్ క్రికెట్‌కు ఏ మాత్రం మంచిది కాదని ఓ ప్రకటనలో హెచ్చరించింది.
'పాకిస్థాన్ ప్రభుత్వ నిర్ణయం మా దృష్టికి వచ్చినప్పటికీ, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) నుంచి అధికారిక సమాచారం కోసం ఇంకా ఎదురుచూస్తున్నాం. టోర్నీలో ఎంపిక చేసిన మ్యాచ్‌ల్లో మాత్రమే ఆడటం అనే పాకిస్థాన్ వైఖరి ఆమోదయోగ్యం కాదు. జాతీయ విధానాలకు సంబంధించిన విషయాల్లో ప్రభుత్వాల పాత్రను గుర్తించి, గౌరవిస్తున్నప్పటికీ.. ఈ నిర్ణయం సరైంది కాదు.
ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్, పాకిస్థాన్‌లోని లక్షలాది మంది అభిమానులకు నిరాశ కలిగించే విషయం. ఈ నిర్ణయం కారణంగా పాకిస్థాన్‌లోని క్రికెట్‌పై చూపే దీర్ఘకాలకి ప్రభావాలను జాగ్రత్తగా పరిశీలించాలని పీసీబీని రిక్వెస్ట్ చేస్తున్నాం.'అని ఐసీసీ తమ ప్రకటనలో పేర్కొంది. భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఐసీసీ సుతిమెత్తంగా పీసీబీని హెచ్చరించింది.

ప్రపంచ క్రికెట్‌లో భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్‌లకు ప్రత్యేక ఆకర్షణ ఉంది. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నప్పటికీ 2012 నుంచి ఐసీసీ, ఏసీసీ టోర్నీల్లోనే ఇరు జట్లు తలపడుతున్నాయి. ఐసీసీ కూడా ఇరు జట్లను ఒకే గ్రూప్‌లో ఆడిస్తున్నాయి. పాకిస్థాన్.. భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తే.. 2010 తర్వాత.. భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగని తొలి ఐసీసీ టోర్నీగా 2026 టీ20 ప్రపంచకప్ నిలిచే అవకాశం ఉంది.
పాకిస్థాన్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే.. ఐసీసీ కఠిన చర్యలు తీసుకోనుంది. విదేశీ ఆటగాళ్లు పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో(PSL) పాల్గొనే విషయంలో నిరభ్యంతర పత్రాలు పొందడంలో ఆంక్షలు విధించే ఛాన్స్ ఉంది. అలాగే ఐసీసీ టోర్నీలకు ఆతిథ్యం ఇచ్చే హక్కులను కూడా పాకిస్థాన్ కోల్పోనుంది. ఐసీసీ నుంచి రావాల్సిన వాటాలో కూడా పీసీబీకి భారీ కోత పడనుంది.
అన్నిటికంటే భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తే నెట్‌రన్‌రేట్ దెబ్బతిని సూపర్-8, సెమీస్ చేరే అవకాశాలు సన్నగిల్లనున్నాయి. ఒకవేళ భారత్, పాక్‌లు తదుపరి రౌండ్‌లో తలపడాల్సి వస్తే పాకిస్థాన్ జట్టు ఏం నిర్ణయం తీసుకుంటుందనేదానిపై కూడా స్పష్టత లేదు. ఏది ఏమైనా ఇరు దేశాల మధ్య నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతలు క్రికెట్ ఆడకుండా కూడా చేశాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.