ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో టీమిండియా క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఒక్క మ్యాచ్‌లో పరాజయం భారత్ పరిస్థితిని ఒక్కసారిగా మార్చేసింది. ఇటీవలి ఫామ్‌ను బట్టి చూస్తే దర్జాగా సెమీఫైనల్ చేరాల్సిన టీమ్ ఇప్పుడు ఒత్తిడిని అధిగమించి తప్పనిసరిగా వరుస రెండు మ్యాచ్‌లు గెలవడంతో పాటు రన్‌రేట్‌పై కూడా ఆధారపడాల్సి వస్తోంది.
మెగా టోర్నీ ప్రారంభానికి ముందు టీమిండియా ఫామ్‌ను చూసి ఎవరూ కూడా ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదు. కానీ టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్.. తన అనుభవంతో సూర్య సేనను ముందే హెచ్చరించాడు. టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా హాట్ ఫేవరేట్‌గా కనిపిస్తున్నా.. ఒక్క బ్యాడ్ డే అంత తలకిందులు చేస్తుందని, జాగ్రత్తగా ఉండాలని సలహా ఇచ్చాడు. 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ అనుభవంతో ఈ మాట చెబుతున్నానని తెలిపాడు.
'ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 బరిలోకి దిగే జట్లలో టీమిండియా హాట్ ఫేవరేట్. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఈజీగా సెమీఫైనల్ చేరుకుంటుంది. అయితే నా చేదు అనుభవాల నుంచి నేర్చుకున్న విషయం ఏంటంటే.. జట్టు ఎంత బలంగా ఉన్నా.. మ్యాచ్ రోజు ఎంత బాగా ఆడుతారనేది ముఖ్యం. ఎవరైనా సరే ఒక మంచి ఇన్నింగ్స్ ఆడి జట్టును దెబ్బతీయగలరు. భారత జట్టు ఎంత పవర్‌ఫుల్‌గా ఉన్నప్పటికీ, ఒక చెడు దినం అంతా తలకిందులు చేయగలదు.'అని మెగా టోర్నీ ప్రారంభానికి ముందు రాహుల్ ద్రవిడ్ హెచ్చరించాడు.

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 లీగ్ దశలో వరుసగా 4 మ్యాచ్‌ల్లో విజయం సాధించి సూపర్-8 చేరిన భారత్.. ఒక్క చెత్త ప్రదర్శనతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఓడిన అహ్మదాబాద్ వేదికగానే.. సౌతాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో ఓడిన టీమిండియా సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ పరాజయం నేపథ్యంలో రాహుల్ ద్రవిడ్ వ్యాఖ్యలను అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. చిలక్కి చెప్పినట్లు ద్రవిడ్ చెప్పినా వినిపించుకోలేదని, ఆటపై ఫోకస్ పెట్టకుండా గర్ల్ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో షికారు చేసి మూల్యం చెల్లించుకున్నారని మండిపడుతున్నారు.
ద్రవిడ్ కామెంట్స్‌ను మదిలో పెట్టుకొని సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో కాస్త ఎమరపాటుతో ఆడినా భారత్‌కు ఈ పరిస్థితి వచ్చేది కాదంటున్నారు. ఆ మ్యాచ్‌లో ఓడినా.. కనీసం రన్‌రేట్ మెరుగుచేసుకునే ప్రయత్నం కూడా చేయలేదని మండిపడుతున్నారు. ప్లాన్ బీగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్.. మ్యాచ్‌ను డీప్‌గా తీసుకెళ్లాల్సిందని, రన్‌రేట్ అయినా మెరుగ్గా ఉండేదని అభిప్రాయపడుతున్నారు.