ఐసీసీ టీ20 ప్రపంచకప్ టోర్నీని జింబాబ్వే ఓటమితో ముగించింది. అసాధారణ ప్రదర్శనతో ఆసీస్‌ను మట్టికరిపించి సూపర్-8కు అర్హత సాధించిన జింబాబ్వే.. ఈ దశలో ఒక్క విజయాన్ని నమోదు చేయలేకపోయింది. మూడింటికి మూడు మ్యాచ్‌ల్లో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఢిల్లీ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా 5 వికెట్ల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది. ఈ గెలుపుతో గ్రూప్-1 టాపర్‌గా సౌతాఫ్రికా సెమీఫైనల్‌కు అర్హత సాధించింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 153 పరుగులే చేసింది. కెప్టెన్ సికందర్ రజా(43 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 73) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. ఈ టోర్నీలో నిలకడైన ప్రదర్శన కనబర్చిన బ్రియాన్ బెన్నెట్(15) ఈ మ్యాచ్‌లో విఫలమయ్యాడు. సౌతాఫ్రికా బౌలర్లలో కార్బిన్ బోష్, క్వెనా మఫకా రెండేసి వికెట్లు తీయగా.. జార్జ్ లింగే, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్జ్ తలో వికెట్ తీసారు.

అనంతరం సౌతాఫ్రికా 17.5 ఓవర్లలో 5 వికెట్లకు 154 పరుగులు చేసి గెలుపొందింది. డెవాల్డ్ బ్రెవిస్(18 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 42), జార్జ్ లిండే(21 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 30 నాటౌట్), ర్యాన్ రికెల్టన్(22 బంతుల్లో 4 సిక్స్‌లతో 31) టాప్ స్కోరర్లుగా నిలిచారు. జింబాబ్వే బౌలర్లలో సికందర్ రజా(3/29) మూడు వికెట్లు తీయగా.. బ్లెస్సింగ్ ముజర్బాని, బ్రాడ్ ఈవాన్స్ తలో వికెట్ తీసారు. కోల్‌కతా వేదికగా బుధవారం జరిగే తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో సౌతాఫ్రికా అమీతుమీ తేల్చుకోనుంది.