ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో ఆస్ట్రేలియా పోరాటం దాదాపు ముగిసింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైన ఆసీస్ సూపర్-8 రేసు నుంచి అనధికారికంగా తప్పుకుంది. గ్రూప్-బీలో భాగంగా శ్రీలంకతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన ఆసీస్ 8 వికెట్ల తేడాతో చిత్తయ్యింది. శ్రీలంక ఓపెనర్ పాతుమ్ నిస్సంక(52 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్‌లతో 100 నాటౌట్) అజేయ శతకంతో ఆసీస్ పతనాన్ని శాసించాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 181 పరుగులకు ఆలౌటైంది. మిచెల్ మార్ష్(27 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 54), ట్రావిస్ హెడ్(29 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 56) హాఫ్ సెంచరీలతో రాణించగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. శ్రీలంక బౌలర్లలో దుషన్ హేమంత(3/37) మూడు వికెట్లు తీయగా.. దుష్మంత చమీర(2/36) రెండు వికెట్లు పడగొట్టాడు. మహీష్ తీక్షణ, దునిత్ వెల్లలెగే, కామిందు మెండీస్ తలో వికెట్ తీసారు.

అనంతరం శ్రీలంక 18 ఓవర్లలో 2 వికెట్లకు 184 పరుగులు చేసింది. పాతుమ్ నిస్సంక(52 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్‌లతో 100 నాటౌట్) అజేయ శతకంతో సత్తా చాటగా.. కుశాల్ మెండీస్(38 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 51) హాఫ్ సెంచరీతో రాణించాడు. పవన్ రత్నాయకే(15 బంతుల్లో 6 ఫోర్లతో 28 నాటౌట్) దూకుడుగా ఆడాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో మార్కస్ స్టోయినీస్(2/46) రెండు వికెట్లు తీసాడు.
ఈ విజయంతో శ్రీలంక సూపర్-8 బెర్త్ ఖరారు చేసుకోగా.. ఆస్ట్రేలియా ఇంటి బాట పట్టింది. అద్భుతం జరిగితే తప్పా ఆసీస్ సూపర్-8 చేరలేదు. ఆ జట్టు ఒమన్‌తో ఆఖరి మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఆ మ్యాచ్‌లో గెలిస్తే ఆసీస్ ఖాతాలో 4 పాయింట్స్ చేరుతాయి. ఈ పరిస్థితుల్లో ఆసీస్ సూపర్-8 చేరాలంటే జింబాబ్వే తమ చివరి రెండు మ్యాచ్‌ల్లో చిత్తుగా ఓడాలి. అప్పుడు ఐర్లాండ్, జింబాబ్వే, ఆసీస్‌లో మెరుగైన రన్ రేట్ ఉన్న జట్టుకు సూపర్-8 బెర్త్ దక్కుతుంది.