టీ20 ప్రపంచకప్ 2024 కీలక దశకు చేరింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 20 దేశాలతో ప్రారంభమైన ఈ టోర్నీ లీగ్ దశను ముగించుకొని సూపర్ 8 దశకు చేరింది. మరికొన్ని లీగ్ మ్యాచ్‌లు మిగిలి ఉన్నా.. సూపర్ 8 బెర్త్‌లు ఖరారు అయ్యాయి. 20 దేశాలను నాలుగు గ్రూప్‌లు విభజించి లీగ్ మ్యాచ్‌లు నిర్వహించగా.. ప్రతీ గ్రూప్‌లో టాప్-2లో నిలిచిన జట్లు సూపర్-8కు అర్హత సాధించాయి.
పాకిస్థాన్ ఔట్..
గ్రూప్-ఏ నుంచి భారత్, ఆతిథ్య అమెరికా దేశం టోర్నీలో ముందడుగు వేయగా.. డిఫెండింగ్ రన్నరప్ పాకిస్థాన్, ఐర్లాండ్, కెనడా ఇంటిదారిపట్టాయి. గ్రూప్-బీలో ఆస్ట్రేలియా, డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ సూపర్-8కు అర్హత సాధించగా.. స్కాట్లాండ్, నమీబియా, ఓమన్ నిష్క్రమించాయి. స్కాట్లాండ్ తృటిలో సూపర్-8 బెర్త్‌ను చేజార్చుకుంది.

న్యూజిలాండ్ ఔట్..
గ్రూప్ సీ నుంచి అఫ్గానిస్థాన్, వెస్టిండీస్ సూపర్ 8 చేరగా.. నిలకడకు మారు పేరైనా న్యూజిలాండ్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ గ్రూప్‌లోని ఉగాండా, పపువా న్యూగేనియాలు కూడా సూపర్-8 రేసు నుంచి తప్పుకున్నాయి. గ్రూప్-డీలో సౌతాఫ్రికా సూపర్-8 బెర్త్ దక్కించుకోగా.. బంగ్లాదేశ్ దాదాపు ఖరారు చేసుకుంది.
ఆ జట్టుకు నెదర్లాండ్స్‌తో పోటీ నెలకొంది. ఆ జట్టు శ్రీలంకతో చివరి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ భారీ విజయం సాధించి.. నేపాల్‌తో జరిగే చివరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చిత్తయితే నెదర్లాండ్స్‌కు అవకాశం ఉంటుంది.
సీడింగ్ అంటే ఏంటి?
లీగ్ దశ ఫలితాలతో కాకుండా సూపర్-8 గ్రూప్‌లను ఐసీసీ సీడింగ్ ప్రకారం విభజించింది. టీ20 ప్రపంచకప్ ప్రారంభానికి ముందే ఐసీసీ సీడింగ్ చేసింది. అంటే సూపర్-8లో ఏ గ్రూప్‌లో ఏ ఏ దేశాలు ఉండాలో ముందుగానే నిర్ణయించింది. గ్రూప్ స్టేజ్ ఫలితాలతో సంబంధం లేకుండా ఐసీసీ ముందుగానే ఫేవరేట్ టీమ్స్‌తో సూపర్-8ను రెండు గ్రూప్‌లుగా విభజించింది.
వరల్డ్ కప్ ఆసక్తికరంగా సాగాలని తదుపరి దశకు చేరుకునే జట్లను ముందుగానే అంచనా వేసి షెడ్యూల్ చేసింది. గ్రూప్-1లో భారత్ (A1), ఆస్ట్రేలియా (B2), న్యూజిలాండ్ (C1), శ్రీలంక (D2)ను ఉంచింది. అలాగే గ్రూప్-2లో పాకిస్థాన్ (A2), ఇంగ్లండ్ (B1), వెస్టిండీస్ (C2), సౌతాఫ్రికా (D1)ను ఎంపిక చేసింది.
కానీ అనూహ్యంగా గ్రూప్-1లో C1గా భావించిన న్యూజిలాండ్, D2గా అనుకున్న శ్రీలంక, A2గా భావించిన పాకిస్థాన్ లీగ్ స్టేజ్‌లోనే టోర్నీ నుంచి నిష్క్రమించాయి. అయితే వాళ్ల స్థానంలో అర్హత సాధించిన అఫ్గానిస్థాన్, అమెరికా, బంగ్లాదేశ్ (అంచనా) సూపర్-8కు అర్హత సాధించాయి.
సూపర్ 8 గ్రూప్స్
గ్రూప్-1
భారత్
ఆస్ట్రేలియా
బంగ్లాదేశ్
అఫ్గానిస్థాన్
గ్రూప్-2
ఇంగ్లండ్
సౌతాఫ్రికా
వెస్టిండీస్
అమెరికా