టీ20 ప్రపంచకప్ 2024లో టీమిండియా విజేతగా నిలవాలంటే తుది జట్టులో కీలక మార్పు చేయాలని మాజీ క్రికెటర్ శ్రీశాంత్ సూచించాడు. శివమ్ దూబే స్థానంలో సంజూ శాంసన్‌ను ఆడించాలన్నాడు. పెద్దగా బౌలింగ్ చేయని శివమ్ దూబేను జట్టులో కొనసాగించడం ఎందుకని ప్రశ్నించాడు.
టీమిండియా సూపర్ 8 మ్యాచ్‌లను వెస్టిండీస్ వేదికగా ఆడుతుందని, అక్కడి పిచ్‌లు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటాయని, ఎక్స్‌ట్రా స్పెషలిస్ట్ బ్యాటర్‌తో బరిలోకి దిగాలని సూచించాడు.

ఓ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీశాంత్ ఈ వ్యాఖ్యలు చేశాడు. 'శివమ్ దూబేకు బదులు మిడిలార్డర్‌లో సంజూ శాంసన్‌ను ఆడించాలి. దూబే బౌలింగ్ చేయనప్పుడు సంజూ శాంసనే బెటర్ ఆప్షన్. ఎందుకంటే సంజూ శాంసన్ పరిస్థితులకు తగ్గట్లు బ్యాటింగ్ చేయగలడు. అంతేకాకుండా పవర్ హిట్టింగ్‌తో క్షణాల్లో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేయగలడు. న్యూయార్క్, బార్బోడస్ ఏ మైదానం అయినా.. టీమిండియా ఎక్స్‌ట్రా బ్యాటర్‌గా సంజూ శాంసన్ పనికివస్తాడు. ఆరంభంలోనే నాలుగు వికెట్లు కోల్పోయిన పరిస్థితుల్లో సంజూ శాంసన్ జట్టును ఆదుకోగలడు. హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజాలా దూకుడుగా బ్యాటింగ్ చేయగలడు.
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఓపెనింగ్ చేయడం అద్భుతం. వారిద్దరి మధ్య ఉన్న సంబంధం గురించి అందరికి తెలిసిందే. గత టీ20 ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ అసాధారణ ఇన్నింగ్స్ ఆడిన అనంతరం రోహిత్ పరుగెత్తుకుంటూ వచ్చిన కోహ్లీ ఎత్తుకున్నాడు. రోహిత్-కోహ్లీ మంచి స్ట్రైక్‌రేట్‌తో 100 పరుగుల భాగస్వామ్యం నమోదు చేస్తే చూడాలని ఉంది. అలా జరిగితే టీమిండియాకే మంచిది'అని శ్రీశాంత్ చెప్పుకొచ్చాడు.
కెనడాతో శనివారం జరగాల్సిన ఆఖరి లీగ్ మ్యాచ్ వర్షం కారణంగా బంతి పడకుండానే రద్దయ్యింది. భారీ వర్షంతో మైదానం మొత్తం చిత్తడిగా మారడంతో పలు మార్లు గ్రౌండ్‌ను పరిశీలించిన అంపైర్లు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించడంతో 7 పాయింట్లతో గ్రూప్ ఏ టాపర్‌గా నిలిచిన భారత్ సూపర్ 8కు అర్హత సాధించింది.
టీ20 వరల్డ్ కప్ సూపర్-8లో భారత్ షెడ్యూల్
జూన్ 20: భారత్ వర్సెస్ అఫ్గానిస్థాన్- బార్బడోస్ (రాత్రి 8 గంటలకు)
జూన్ 22: భారత్ వర్సెస్ బంగ్లాదేశ్- ఆంటిగ్వా (రాత్రి 8 గంటలకు)
జూన్ 24: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా- లూసియా (రాత్రి 8 గంటలకు)