టీ20 ప్రపంచకప్ 2024లో సౌతాఫ్రికా జట్టు శుభారంభం చేసింది. గ్రూప్ డీలో భాగంగా శ్రీలంకతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన సౌతాఫ్రికా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 77 పరుగులకే కుప్పకూలింది. అన్రిచో నోకియా (4/7) నిప్పులు చెరగగా.. కగిసో రబడా(2/21), కేశవ్ మహరాజ్(2/22) రెండేసి వికెట్లతో శ్రీలంక పతనాన్ని శాసించారు.
ఓట్‌నీల్ బార్ట్‌మన్ ఓ వికెట్ పడగొట్టాడు. సఫారీ బౌలర్ల ధాటికి నలుగురు శ్రీలంక బ్యాటర్లు డకౌటయ్యారు. కుశాల్ మెండీస్(30 బంతుల్లో ఫోర్‌తో 19), ఏంజెలో మాథ్యూస్(16 బంతుల్లో 2 సిక్స్‌లతో 16), కామిందు మెండిస్(15 బంతుల్లో ఫోర్‌తో 11) రెండెంకల స్కోర్లు చేశారు.

కెప్టెన్ వానిందు హసరంగా(0), సదీర విక్రమార్క(0), మతీష పతీరణ(0), నువాన్ తుషారా(0) డకౌటవ్వగా.. పాతుమ్ నిస్సంక(3), చరిత్ అసలంక(6), డసన్ షనక(9), మహీష్ తీక్షణ(7 నాటౌట్) సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన సౌతాఫ్రికా 16.2 ఓవర్లలో 4 వికెట్లకు 80 పరుగులు చేసి మరో 22 బంతులు మిగిలి ఉండగానే గెలుపొందింది. పిచ్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉండటంతో సఫారీ బ్యాటర్లు జాగ్రత్తగా బ్యాటింగ్ చేశారు. క్వింటన్ డికాక్(27 బంతుల్లో సిక్స్‌తో 20), హెన్రీచ్ క్లాసెన్(22 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 19 నాటౌట్) రాణించారు.
ఎయిడెన్ మార్క్‌రమ్(12), రెజా హెండ్రీక్స్(4) విఫలమయ్యారు. డేవిడ్ మిల్లర్(6 నాటౌట్) ఔటవ్వకుండా అజేయంగా నిలిచాడు. శ్రీలంక బౌలర్లలో వానిందు హసరంగా(2/22) రెండు వికెట్లు తీయగా.. నువాన్ తుషారా, డసన్ షనక తలో వికెట్ తీసారు.
కెప్టెన్ వానిందు హసరంగా తప్పిదంతో శ్రీలంక మూల్యం చెల్లించుకుంది. పిచ్ కండిషన్స్‌ను సరిగ్గా అంచనా వేయకుండా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకోవడం శ్రీలంక కొంపముంచింది. ఈ పిచ్‌కు తగ్గట్లు ఆడి శ్రీలంక 110 ప్లస్ రన్స్ చేసినా.. సౌతాఫ్రికా ఓటమిపాలయ్యేది. పిచ్ పూర్తిగా బౌలింగ్‌కు అనుకూలంగా ఉండటంతో ఇరు జట్ల బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు.
ఈ మ్యాచ్‌లో మొత్తం 6 సిక్స్‌లు, 5 బౌండరీలు నమోదయ్యాయంటేనే పిచ్ బ్యాటింగ్‌కు ఎంత కఠినంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.