టీమిండియా స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌పై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) క్రమశిక్షణ చర్యలు తీసుకుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20 ప్రపంచకప్ 2024కు శుభ్‌మన్ గిల్ రిజర్వ్‌డ్ ప్లేయర్‌గా ఎంపికైన విషయం తెలిసిందే.
అతనికి బదులు యువ ఓపెనర్, లెఫ్టాండర్ యశస్వి జైస్వాల్ భారత జట్టులో ప్రధాన ఓపెనర్‌గా చోటు దక్కించుకున్నాడు. అయితే విరాట్ కోహ్లీ ఓపెనర్‌గా ఆడుతుండటంతో యశస్వి జైస్వాల్ సైతం బెంచ్‌కే పరిమితమయ్యాడు. రిజర్వ్‌డ్ ఆటగాడిగా ఎంపికైన శుభ్‌మన్ గిల్‌తో పాటు ఆవేశ్ ఖాన్‌లు స్వదేశం వచ్చేందుకు రెడీ అయ్యారు.

ఈ ఇద్దర్నీ ఫ్లోరిడా నుంచి స్వదేశం వెళ్లిపోవాలని టీమిండియా మేనేజ్‌మెంట్ ఆదేశించింది. రిజర్వ్‌డ్ ప్లేయర్లుగా ఉన్న రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్‌లను మాత్రం జట్టుతోనే ఉంచుకుంది.
బ్యాకప్ ఓపెనర్‌గా యశస్వి జైస్వాల్‌తో పాటు సంజూ శాంసన్ ఉన్నాడు. అలాగే బుమ్రా, సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబేలతో పేస్ విభాగం కూడా నిండుగా ఉంది. ఈ క్రమంలోనే శుభ్‌మన్ గిల్, ఆవేశ్ ఖాన్‌లను స్వదేశం వెళ్లిపోవాలని టీమ్‌మేనేజ్‌మెంట్ ఆదేశించినట్లు టీమ్ వర్గాలు పేర్కొన్నాయి.
అయితే ఉన్నపళంగా ఈ ఇద్దరిని స్వదేశం పంపించడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. క్రమశిక్షణ చర్యల్లో భాగంగానే ఈ ఇద్దరిని స్వదేశం పంపించినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రాక్టీస్ సెషన్‌కు దూరంగా ఉండటం, కోచ్‌ల మాట వినకపోవడం, జట్టుకు అండగా చెప్పిన పనులు చేయకపోవడంతో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆగ్రహానికి గరయ్యారని, ఈ క్రమంలోనే శుభ్‌మన్ గిల్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది.
అయితే ఈ ప్రచారాన్ని ఓ సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ గౌరవ్ గుప్తా ఖండించారు. ప్రస్తుతం టీ20 ప్రపంచకప్ 2024ను కవర్ చేస్తున్న ఆయన.. శుభ్‌మన్ గిల్ వస్తున్న కథనాలు అవాస్తవమని స్పష్టం చేశారు. టీమిండియాకు సరిపోను రిజర్వ్‌డ్ ఆటగాళ్లు ఉండటంతోనే వారిని స్వదేశానికి పంపిస్తున్నారని తెలిపారు.