ఐపీఎల్ 2024 సీజన్ ముగిసిందో లేదో అప్పుడే టీ20 ప్రపంచకప్ 2024 సందడి మొదలైంది. మరో మూడు రోజుల్లో అగ్రరాజ్యం అమెరికా వేదికగా ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. ఇప్పటికే టీ20 ప్రపంచకప్‌లో బరిలోకి దిగే జట్లన్నీ అమెరికాలో అడుగుపెట్టి ప్రాక్టీస్ ప్రారంభించాయి. వామప్ మ్యాచ్‌లతో అక్కడి పరిస్థితులకు అలవాటు పడే ప్రయత్నం చేస్తున్నాయి.
అందుబాటులో ఉన్న ఆటగాళ్లతో రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా ఇప్పటికే అమెరికాలో అడుగుపెట్టింది. వ్యక్తిగత కారణాలతో విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా వంటి కొందరు సీనియర్ ఆటగాళ్లు ఆలస్యంగా జట్టుతో కలవనున్నారు. భారత టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన రింకూ సింగ్ కూడా అమెరికా వెళ్లేందుకు సిద్దమవుతున్నాడు.

అందుకే నాపై వేటు..
15 మంది సభ్యులతో కూడిన జట్టులో రింకూ సింగ్‌కు అవకాశం రాకపోయినా.. స్టాండ్ బై ప్లేయర్‌గా అమెరికా వెళ్లనున్నాడు. విధ్వంసకర ఫినిషర్‌గా గుర్తింపు తెచ్చుకున్న రింకూ సింగ్‌కు టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు ఖాయమని అంతా భావించినా నిరాశే ఎదురైంది. టీ20 ప్రపంచకప్‌లో చోటు దక్కకపోవడంపై మౌనంగా ఉన్న రింకూ సింగ్ తాజాగా ఓ జాతీయ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనపై వేటు వేయడానికి గల కారణాన్ని వెల్లడించాడు.
అంతేకాకుండా ఐపీఎల్ 2024 సందర్భంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఏం చెప్పాడో కూడా వివరించాడు. 'అద్భుత ప్రదర్శన కనబర్చిన తర్వాత కూడా అవకాశం రాకపోతే ఎవరికైనా బాధగానే ఉంటుంది. అయితే టీమ్ కాంబినేషన్‌లో భాగంగానే నాకు ఈసారి అవకాశం దక్కలేదు. దీనికి నాకు ఎలాంటి బాధ లేదు. మనచేతుల్లో లేని విషయాలు గురించి అతిగా ఆలోచించాల్సిన అవసరం లేదు.
రోహిత్ చెప్పింది ఇదే..
ప్రపంచకప్‌లో చోటు దక్కలేదని తెలిసిప్పుడు కొంత బాధపడ్డాను. కానీ ఇప్పుడు పెద్దగా చింతించడం లేదు. ఏం జరిగినా మన మంచికేనని భావిస్తున్నా. రోహిత్ భాయ్ నాకు ప్రత్యేకంగా ఏది చెప్పలేదు. ఆయన నాతో చెప్పిన మాట ఒక్కటే.. కష్టపడుతూనే ఉండమన్నాడు. రెండేళ్ల తర్వాత మళ్లీ టీ20 ప్రపంచకప్ ఉంటుందని, కాబట్టి ఈ సారి అవకాశం రాలేదని బాధపడాల్సిన అవసరం లేదని రోహిత్ భాయ్ చెప్పాడు.'అని రింకూ సింగ్ చెప్పుకొచ్చాడు.
రోహిత్ శర్మ కెప్టెన్సీపై రింకూ సింగ్ ప్రశంసల జల్లు కురిపించాడు. కుర్రాళ్లు బాగా ఆడాలని కోరుకునే వ్యక్తి అని కొనియాడాడు. 'రోహిత్ శర్మ కెప్టెన్సీ గురించి ప్రపంచం మొత్తానికి తెలుసు. నా అనుభవం గురించి చెప్పమంటే.. ఆయనతో నేను ఒకే ఒక్క పర్యటనకు వెళ్లాను. ఆ టూర్‌లో కూడా రోహిత్ భాయ్‌తో నేను ఎక్కువగా మాట్లాడలేదు. అయితే ఆయన కుర్రాళ్లకు మాత్రం అండగా ఉంటారు. యువ ఆటగాళ్లు బాగా ఆడాలని కోరుకుంటాడు. ఎప్పుడూ బాగా ఆడాలని చెబుతూ ఉంటాడు.'అని రింకూ సింగ్ తెలిపాడు.