టీ20 ప్రపంచకప్ 2024లో వరుస పరాజయాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాకిస్థాన్‌కు మరో షాక్ తగిలింది. గ్రూప్-ఏలో భాగంగా ఐర్లాండ్‌తో ఫ్లోరిడా వేదికగా ఆదివారం జరగనున్న ఆఖరి మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే అమెరికా, భారత్ చేతిలో ఓడి సూపర్-8 అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న పాకిస్థాన్‌కు చివరి మ్యాచ్ గెలవడం చాలా కీలకం.
ప్రస్తుతం గ్రూప్-ఏలో వరుస విజయాలు సాధించిన భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. రెండు మ్యాచ్‌లకు రెండు గెలిచిన అమెరికా రెండో స్థానంలో ఉండగా.. ఒకే ఒక్క విజయం సాధించిన పాకిస్థాన్, కెనడా మూడు, నాలుగు స్థానల్లో కొనసాగుతున్నాయి. ఖాతా తెరవని ఐర్లాండ్ ఐదవ స్థానంలో ఉంది.

అమెరికాతో మరికాసేపట్లో ప్రారంభమయ్యే మ్యాచ్‌లో విజయం సాధిస్తే భారత్ అధికారికంగా సూపర్-8కు అర్హత సాధిస్తుంది. అమెరికా గెలిచినా ఆ జట్టు టోర్నీలో ముందడుగు వేస్తోంది. అమెరికా చేతిలో ఓడినా భారత్‌కు కెనడా రూపంలో మరో ఛాన్స్ ఉంది. ఆ జట్టుతో జరిగే ఆఖరి మ్యాచ్‌లో గెలిచినా టోర్నీలో ముందడుగు వేస్తోంది.
మరోవైపు పాకిస్థాన్ సూపర్ 8 చేరాలంటే అమెరికా తమ చివరి రెండు మ్యాచ్‌ల్లో చిత్తుగా ఓడాలి. అంతేకాకుండా పాకిస్థాన్ తమ చివరి రెండు మ్యాచ్‌ల్లో మెరుగైన రన్ రేట్‌తో విజయం సాధించాలి. అయితే ఐర్లాండ్‌తో ఫ్లోరిడా వేదికగా ఆదివారం జరగనున్న పాకిస్థాన్ ఆఖరి మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. ఒకవేళ ఈ మ్యాచ్ వర్షంతో రద్దయితే పాకిస్థాన్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తోంది.
ఫ్లోరిడా వేదికగా ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు జరగ్గా.. ఈ మూడింటికి వర్షం అంతరాయం కలిగించింది. వచ్చే వారం రోజులు ఫ్లోరిడాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ పేర్కొంది. ముఖ్యంగా పాకిస్థాన్ మ్యాచ్ జరిగే ఆదివారం రోజు కుండపోత వర్షం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదే వేదికగా మంగళవారం జరగాల్సిన నేపాల్ వర్సెస్ శ్రీలంక మ్యాచ్ ఒక్క బంతి కూడా పడకుండానే వర్షం కారణంగా రద్దయ్యింది. ఈ క్రమంలోనే పాకిస్థాన్ అభిమానులు, ఆటగాళ్లు ఆందోళనకు గురవుతున్నారు.
కెనడాతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కెనడా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 106 పరుగులు చేసింది. పాకిస్థాన్ బౌలర్లలో మహమ్మద్ అమీర్(2/13), హ్యారీస్ రౌఫ్(2/26) నిప్పులు చెరగగా.. షాహిన్ షా అఫ్రిది, నసీమ్ షా తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన పాకిస్థాన్ 17.3 ఓవర్లలో 3 వికెట్లకు 107 పరుగులు చేసి గెలుపొందింది. మహమ్మద్ రిజ్వాన్(53 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 53 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. బాబర్ ఆజామ్(33 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 33) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.